Ruturaj Gaikwad: రుతురాజ్ దెబ్బకు స్టేడియంలోని కారుకు సొట్ట!

 Ruturaj Massive Six Dents On Sponsers Car
  • వరుసగా రెండో అర్ధ సెంచరీ నమోదు చేసిన గైక్వాడ్
  • కృష్ణప్ప గౌతమ్ బౌలింగ్‌లో రుతురాజ్ భారీ సిక్సర్
  • స్టాండ్స్‌లో ప్రదర్శనకు ఉంచిన కారును తాకిన బంతి
  • వైరల్ అవుతున్న ఫొటోలు
ఐపీఎల్‌లో భాగంగా గతరాత్రి లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 12 పరుగుల తేడాతో విజయం సాధించి పాయింట్ల ఖాతా తెరిచింది. గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో వీర విజృంభణ చేసిన చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ బ్యాట్ ఝళిపించాడు. 31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 57 పరుగులు చేసి వరుసగా రెండో అర్ధ సెంచరీ నమోదు చేశాడు.

ఈ మ్యాచ్‌లో రుతురాజ్ లాగిపెట్టి కొట్టిన బంతి స్టేడియంలో ప్రదర్శనకు ఉంచిన కారుకు తగిలి సొట్టపడింది. కృష్ణప్ప గౌతమ్ వేసిన ఐదో ఓవర్ చివరి బంతిని గైక్వాడ్ స్టాండ్స్‌లోకి పంపాడు. అక్కడ ప్రదర్శనకు ఉంచిన కారును బంతి బలంగా తాకడంతో దానికి సొట్టపడింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై గైక్వాడ్ (57), డెవోన్ కాన్వే (47) దెబ్బకు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 218 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన లక్నో సూపర్ జెయింట్స్ పోరాడి ఓడింది. 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 205 పరుగులు మాత్రమే చేయగలిగింది.
Ruturaj Gaikwad
CSK
IPL 2023

More Telugu News