Anand Mahindra: ఇడ్లీలు భలే వేస్తున్నాడు.. అదిరిపోయింది..ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్

Anand Mahindra shares video of a man preparing idlies on mass scale
  • భారీ స్థాయిలో ఇడ్లీలు రెడీ చేస్తున్న కుక్
  • వంటచేసే వ్యక్తి నైపుణ్యానికి ఆనంద్ మహీంద్రా ఫిదా 
  • నెట్టింట మహీంద్రా షేర్ చేసిన వీడియో వైరల్
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌లో పంచుకునే విషయాలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి. గొప్ప వ్యక్తుల జీవితాల్లోని స్ఫూర్తివంతమైన ఘటనలే కాకుండా ఆయన అప్పుడప్పుడూ కొన్ని ఆసక్తికర విషయాలూ షేర్ చేస్తుంటారు. తాజాగా ఆయన ఇడ్లీల తయారీకి సంబంధించి షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. 

ఓ వ్యక్తి కస్టమర్ల కోసం భారీ సంఖ్యలో ఇడ్లీలు వేస్తున్న వీడియో ఇది. ఇడ్లీ మౌల్డ్‌లో పిండి వేయడం, ఇడ్లీలు ఉడికాయో లేదో చెక్ చేయడం.. ఇలా ప్రతిదీ తనదైన శైలిలో వేగంగా చేశాడా వ్యక్తి. చివరకు అతడు తను వేసిన ఇడ్లీలను ఆవుకు కూడా పెట్టాడు. ఇదంతా వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. 

ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా నెట్టింట షేర్ చేస్తూ ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ‘‘ఇళ్లల్లో ఆడవాళ్లు నెమ్మదిగా, శ్రద్ధగా ఇడ్లీలు వేయడం మనం చూశాం. మరోవైపు, వ్యాపారం చేసే వాళ్లు ఇలా భారీ స్థాయిలో ఇడ్లీలు సిద్ధం చేస్తుంటారు. ఇడ్లీలు సిద్ధం చేసే పద్ధతి ఏదైనప్పటికీ.. అందులో ఓ మానవీయకోణం, భారతీయత కొట్టొచ్చినట్టు కనబడుతుంది’’ అంటూ ఆయన రాసుకొచ్చారు. ఇప్పటివరకూ ఈ వీడియోకు 9.9 లక్షల వ్యూస్ వచ్చాయంటే వీడియో ఎంతగా వైరల్ అవుతోందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇక నెటిజన్లు కూడా తమదైన శైలిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Anand Mahindra

More Telugu News