Uddhav Thackeray: డిగ్రీ సర్టిఫికెట్ చూపించేందుకు సిగ్గెందుకు?: ఉద్ధవ్ థాకరే

Uddav Thackeray comments on Modi on degree certificate
  • డిగ్రీ సర్టిఫికెట్ చూపించమని అడిగినందుకు రూ. 25 వేలు ఫైన్ విధించారన్న థాకరే
  • అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూడా తమ కూటమి బలంగా ఉందని వ్యాఖ్య
  • మోదీ హిందుత్వ వల్ల దేశానికి ఏం ఉపయోగమని ప్రశ్న
ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీ సర్టిఫికెట్ వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మోదీ డిగ్రీ సర్టిఫికెట్ వివరాలు కావాలని అడిగినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు గుజరాత్ హైకోర్టు రూ. 25 వేలు జరిమానా విధించింది. ఈ క్రమంలో ఈ అంశం మరింత వివాదాస్పదంగా మారింది. తాజాగా ఇదే అంశంపై సేన చీఫ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే మోదీపై విమర్శలు గుప్పించారు. 

దేశంలో ఎంతో మంది డిగ్రీ చదివిన యువత ఉద్యోగాలు లేకుండా ఉన్నారని... మోదీని డిగ్రీ సర్టిఫికెట్ చూపించమని అడిగినందుకు రూ. 25 వేలు ఫైన్ విధించారని థాకరే విమర్శించారు. డిగ్రీ ఎక్కడ చదివారో చెప్పుకోవడానికి సిగ్గెందుకని ప్రశ్నించారు. ప్రధాని తమ కాలేజీలో చదివారని ఆ కాలేజీ వాళ్లు గొప్పగా చెప్పుకోవచ్చని అన్నారు. 

ముఖ్యమంత్రి కావాలనే కోరికతో సిద్ధాంతాల పరంగా విరుద్ధమైన కాంగ్రెస్, ఎన్సీపీలతో పొత్తు పెట్టుకున్నారంటూ థాకరేపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆయన స్పందిస్తూ... 'అవును, మేము అధికారం కోసమే కలిశాం. అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూడా తాము కలిసే ఉన్నాం. మరింత బలంగా తయారయ్యాం' అని అన్నారు. 

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి హిందుత్వ పేరుతో ప్రజలను బీజేపీ నేతలు రెచ్చగొడుతుంటారని థాకరే మండిపడ్డారు. మనకు గొప్ప హిందూ ప్రధాని ఉన్నారని గొప్పలు చెప్పుకుంటుంటారని... ఈ గొప్పదనం వల్ల దేశానికి ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు. తాను హిందుత్వను వదిలేశానని విమర్శిస్తున్నారని... తాను హిందుత్వను వదిలి పెట్టానని చెప్పడానికి ఒక్క ఉదాహరణ అయినా చూపించాలని సవాల్ విసిరారు. న్యాయ వ్యవస్థను కూడా గుప్పిట్లోకి తీసుకోవడానికి బీజేపీ యత్నిస్తోందని... కానీ, న్యాయ వ్యవస్థ వారికి లొంగడం లేదని చెప్పారు.
Uddhav Thackeray
Shiv Sena
Narendra Modi
BJP

More Telugu News