చాట్‌జీపీటీతో యువకుడికి రూ.28 లక్షల ఆదాయం!
- చాట్‌జీపీటీ వినియోగంపై వీడియో కోర్సు ప్రారంభించిన అమెరికా యువకుడు
- యూడెమీ యాప్‌లో అతడి కోర్సుకు అనూహ్య స్పందన
- భారీ సంఖ్యలో సబ్‌స్క్రైబర్లు, లక్షల్లో ఆదాయం
- చాట్‌జీపీటీపై అపోహలు తొలగించడమే తన లక్ష్యమంటున్న యువకుడు
ఆస్టిన్ రాష్ట్రానికి చెందిన లాన్స్ జంక్ గతేడాది నవంబర్‌లో తొలిసారిగా చాట్‌జీపీటీని చూశాడు. ఆ తరువాత చాట్‌జీపీటీ గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాడు. ఈ చాట్‌బాట్ అసాధారణ సామర్థ్యాలు చూసి అతడి ఆశ్చర్యానికి అంతేలేకుండా పోయింది. అయితే, చాట్‌జీపీటీ ఉపయోగాలపై యువతలోనూ అవగాహన లోపించడం అతడిని ఆలోచనలో పడేసింది. ఈ సాంకేతికతపై ప్రజల్లో భయాలు, అపోహలు ఉన్న విషయాన్ని గుర్తించాడు. దీంతో.. ప్రజల్లో అవగాహన పెంచేందుకు యూడెమీ ప్లాట్ ఫాంలో చాట్‌జీపీటీ మాస్టర్ క్లాస్ పేరిట వీడియో తరగతుల సిరీస్‌ను ప్రారంభించాడు.
ఈ కోర్సుకు ప్రజల నుంచి అతడు ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చింది. 20 ఏళ్ల వయసున్న యువత నుంచి 50వ పడిలో ఉన్న వారివరకూ అనేక మంది ఈ కోర్సులో చేరారు. అమెరికాతో పాటూ కెనడా, ఇండియా వారు కూడా ఈ కోర్సును సబ్‌స్క్రైబ్ చేశారు. దీంతో, అతడిపై కనకవర్షం కురవడం ప్రారంభమైంది. దీంతో అతడి ఆనందానికి అంతేలేకుండా పోయింది. చాట్‌జీపీటీపై అపోహలను తొలగించి దీన్ని ప్రజలకు మరింత దగ్గర చేయడమే తన లక్ష్యమని లాన్స్ చెప్పుకొచ్చాడు.