YouTube: మహిళలను కించపరుస్తున్న యూట్యూబ్ చానళ్ల ఆటకట్టించిన పోలీసులు

8 Youtubers arrested for humiliate women with their channels
  • మహిళలు, సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులే లక్ష్యంగా ట్రోల్స్
  • మహిళల ఫొటోలను మార్ఫింగ్ చేసి అసభ్యంగా చిత్రీకరణ
  • 8 మంది నిందితుల అరెస్ట్
  • కొన్ని చానళ్ల గుర్తింపు.. కొనసాగుతున్న దర్యాప్తు
మహిళలు, ప్రజా ప్రతినిధులు, సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని కించపరుస్తున్న యూట్యూబ్ చానళ్లపై హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కొరడా ఝళిపించారు. వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్న 20 యూట్యూబ్ చానళ్లపై కేసులు నమోదు చేసి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. సీఆర్‌పీసీ 41ఎ కింద వారికి నోటీసులు జారీ చేశారు. 

మహిళలు, సెలబ్రిటీలపై వ్యక్తిగత దూషణలకు పాల్పడడమే కాకుండా వారి ఫొటోలను మార్ఫింగ్ చేసి యూట్యూబ్ చానళ్లలో అసభ్యంగా చిత్రించడం, సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడంపై తమకు ఫిర్యాదులు అందినట్టు డీసీపీ స్నేహ తెలిపారు. ఐపీ అడ్రస్‌ల ఆధారంగా తమ సైబర్ క్రైమ్స్ బృందం నిందితులను గుర్తించినట్టు పేర్కొన్నారు.

ఆ చానళ్లలో ఎంకమ్మ, చెవిలో పువ్వు, బంతిపువ్వు, ట్రోల్స్ కుర్రాడు వంటివి ఉన్నట్టు తెలిపారు. నిందితులందరూ తెలుగు రాష్ట్రాలకు చెందిన వారేనని, వీరంతా 20-30 ఏళ్ల లోపు వారేనని చెప్పారు. అదుపులోకి తీసుకున్న నిందితులకు నోటీసులు ఇచ్చి వదిలిపెట్టామని, మిగతా చానళ్లను కూడా గుర్తిస్తున్నట్టు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతున్నట్టు పేర్కొన్నారు.
YouTube
YouTube Trolls
Cyber Crime
Hyderabad

More Telugu News