'శాకుంతలం' 3D ట్రైలర్ లాంచ్ ఈవెంటులో ఎవరెవరు ఏమన్నారంటే..!

  • అభిమానుల సమక్షంలో 'శాకుంతలం' 3D ట్రైలర్ రిలీజ్ 
  • సమంత ప్రాణ ప్రతిష్ఠ చేసిందన్న గుణశేఖర్ 
  • తరువాత జనరేషన్స్ కోసం ఇలాంటి సినిమాలు రావాలన్న దిల్ రాజు
  • ఈ సినిమాకి పనిచేయడం అదృష్టమన్న బుర్రా సాయిమాధవ్
Shaakuntalam Trailer launch Event

గుణశేఖర్ దర్శకత్వంలో అందమైన ప్రేమకథా కావ్యంగా 'శాకుంతలం' రూపొందింది. దిల్ రాజు నిర్మాణ భాగస్వామిగా ఉన్న ఈ సినిమాకి, మణిశర్మ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. శకుంతలగా సమంత నటించిన ఈ సినిమాలో, దుష్యంతుడిగా దేవ్ మోహన్ కనిపించనున్నాడు.

సమంత అభిమానులంతా ఈ సినిమా కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని ప్రధానమైన పాత్రలను పరిచయం చేస్తూ .. ఒక్కో పాటను వదులుతూ వెళుతున్నారు. ప్రమోషన్స్ లో భాగంగానే కొంతసేపటి క్రితం హైదరాబాద్ - ప్రసాద్ ఐ మ్యాక్స్ వేదికగా ఈ సినిమా నుంచి 3D ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

దిల్ రాజు మాట్లాడుతూ .. "నిజానికి ఈ సినిమా నిర్మాణంలో నేను జాయిన్ కావటానికి కారణం, గుణశేఖర్ గారికి హెల్ప్ చేయడం కోసమే అని అంతా అనుకుంటున్నారు. కానీ వీఎఫ్ ఎఫెక్స్ కి సంబంధించిన ఒక పాన్ ఇండియా సినిమాకి ఎలా పనిచేయాలనేది నేర్చుకోవడం కోసం ఈ ప్రాజెక్టులో జాయిన్ అయ్యాను. తరువాత జనరేషన్స్ వారికి ఇలాంటి కథలను పరిచయం చేయవలసిన అవసరం ఉంది. ఈ వేసవి కోసం ఒక మంచి సినిమాను రెడీ చేశాము .. చూసి ఎంజాయ్ చేయండి" అన్నారు. 

గుణశేఖర్ మాట్లాడుతూ .. "ఇది సమంతగారి 'శాకుంతలం' .. మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకూ ఆమె అద్భుతంగా చేశారు. శకుంతల పాత్రకి ప్రాణ ప్రతిష్ఠ చేశారు" అని అన్నారు. 

రచయిత బుర్రా సాయిమాధవ్ మాట్లాడుతూ .. "ఈ కథను గుణశేఖర్ గారు టేకాఫ్ చేసే విధానమే అద్భుతంగా అనిపించింది. ఈ సినిమా నవ్విస్తుంది ... ఏడిపిస్తుంది. ప్రపంచంలో ప్రేమతప్ప మరేదీ లేదనిపిస్తుంది. సమంతగారు తన పాత్రకి వందకి వంద శాతం న్యాయం చేశారు. ఈ సినిమాకి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను" అన్నారు.

More Telugu News