Supreme Court: అమరావతి కేసు త్వరగా విచారించాలన్న ఏపీ ప్రభుత్వం... అసహనం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

SC rejects AP govt request to take up hearing in Amaravati
  • సుప్రీంకోర్టులో ముంబయి కార్పొరేషన్ కేసు విచారణ
  • భోజన విరామంతో నిలిచిన విచారణ
  • అనంతరం తిరిగి ప్రారంభం కాగా... అమరావతి కేసు విచారించాలన్న ఏపీ సర్కారు
  • ముంబయి కేసు విచారణ జరుగుతుంటే మధ్యలో ఎలా విచారిస్తామన్న సుప్రీం
ఏపీ రాజధాని అమరావతి అంశంపై దాఖలైన పిటిషన్ ను సత్వరమే విచారించాలన్న ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఒక కేసు పూర్తి కానిదే మరో కేసు ఎలా విచారిస్తామని జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్న బెంచ్ ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాదులపై అసహనం వ్యక్తం చేసింది. నిబంధనల ప్రకారం అలా వెళ్లలేమని స్పష్టం చేసింది. 

ఇవాళ సుప్రీంకోర్టులో ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ కేసు విచారణ జరుగుతుండగా లంచ్ బ్రేక్ వచ్చింది. విరామం అనంతరం ఇతర కేసులు, పలు అంశాలకు సంబంధించి మెన్షనింగ్స్ వచ్చాయి. ఈ సందర్భంగా తమ కేసు విచారణ మొదలుపెట్టాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు కోరినప్పుడు సుప్రీం ద్విసభ్య ధర్మాసనం పైవిధంగా స్పందించింది. 

ఓవైపు ముంబయి కార్పొరేషన్ కేసు విచారణ సగంలో ఉంటే, దాన్ని వదిలేసి మీ కేసు తీసుకోమంటారా? అని జస్టిస్ కేఎం జోసెఫ్ అసహనం వెలిబుచ్చారు. ఇక, జులై 11న అమరావతి అంశాన్ని తొలి కేసుగా విచారణకు తీసుకుంటామని సుప్రీంకోర్టు వెల్లడించింది. అమరావతిపై హైకోర్టు తీర్పు పట్ల స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు కోరగా, అందుకు సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది.

అటు, రాజధాని పిటిషన్ దారుల్లో కొందరు రైతులు మరణించారని, వారి స్థానంలో ప్రతినిధులు ప్రతివాదులుగా ఉండేందుకు అనుమతించాలని ప్రతివాదుల తరఫు న్యాయవాదులు కోరారు. అందుకు న్యాయస్థానం సమ్మతించింది. ఆ మేరకు రైతుల ప్రతినిధులకు నోటీసులు పంపాలని ప్రభుత్వ న్యాయవాదులకు స్పష్టం చేసింది.
Supreme Court
Amaravati
AP Govt
Andhra Pradesh

More Telugu News