Air India: ఢీకొనే ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్న భారత్, నేపాల్ విమానాలు

Air India and Nepal Airlines planes escapes a collision
  • ఖాట్మండూ ఎయిర్ పోర్టు వద్ద ఘటన
  • ఢిల్లీ నుంచి నేపాల్ చేరుకున్న ఎయిరిండియా విమానం
  • అదే సమయంలో మలేసియా నుంచి వచ్చిన నేపాల్ ఎయిర్ లైన్స్ విమానం
  • రెండూ ఒకే ఎత్తులో ప్రయాణిస్తున్న వైనం
  • సమయస్ఫూర్తితో స్పందించిన ఎయిరిండియా పైలెట్లు
  • విమానాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లడంతో తప్పిన ముప్పు
ఎయిరిండియా విమానం, నేపాల్ ఎయిర్ లైన్స్ విమానం గగనతలంలో పరస్పరం ఢీకొనే ప్రమాదం నుంచి తప్పించుకున్నాయి. ప్రమాదాన్ని పసిగట్టిన ఎయిరిండియా విమాన పైలెట్లు వెంటనే తమ విమానాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లడంతో ముప్పు తప్పింది. 

ఢిల్లీ నుంచి నేపాల్ చేరుకున్న ఎయిరిండియా ఎయిర్ బస్ -319 విమానానికి ఖాట్మండూ విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు క్లియరెన్స్ ఇచ్చారు. దాంతో ఎయిరిండియా విమాన పైలెట్లు 19 వేల అడుగుల ఎత్తు నుంచి 15 వేల అడుగులకు ఆల్టిట్యూడ్ ను తగ్గించారు. అయితే కౌలాలంపూర్ నుంచి నేపాల్ చేరుకున్న విమానం కూడా ల్యాండ్ అయ్యేందుకు అదే ఎత్తులో వస్తోంది. 

దీన్ని గమనించిన ఎయిరిండియా పైలెట్లు సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెనుప్రమాదం తప్పినట్టయింది. తమ విమానాన్ని వారు మళ్లీ ఎత్తుకు తీసుకెళ్లడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ సమయంలో రెండు విమానాల్లోనూ 200 మంది ప్రయాణికుల వరకు ఉన్నారు. 

ఈ ఘటనకు బాధ్యులుగా ఖాట్మండూ ఎయిర్ పోర్టులో ముగ్గురు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లను సస్పెండ్ చేశారు. అంతేకాదు, ఘటనపై విచారణ నిమిత్తం ఎయిరిండియా విమాన పైలెట్లను, నేపాల్ ఎయిర్ లైన్స్ విమాన పైలెట్లను విధుల నుంచి తాత్కాలికంగా తప్పించారు. ఈ విషయాన్ని నేపాల్ వర్గాలు భారత్ లోని డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) కార్యాలయానికి తెలియజేశాయి.
Air India
Nepal Airlines
Planes
Collision
Khatmandu Airport

More Telugu News