నిమిషాల వ్యవధిలో ట్విస్ట్.. కాంగ్రెస్ లో చేరిన ధర్మపురి శ్రీనివాస్

  • కొడుకు సంజయ్ తో కలిసి వీల్ చైర్ పై గాంధీభవన్ కు వెళ్లిన డీఎస్
  • అంతకుముందు తన కొడుకు కాంగ్రెస్ లో చేరుతున్నాడని లేఖ
  • తాను పార్టీ మారట్లేదంటూ లేఖలో వివరణ ఇచ్చిన సీనియర్ నేత
  • కాంగ్రెస్ లో చేరాక ఆ లేఖతో తనకు సంబంధంలేదని ప్రకటన
Dharmapuri Srinivas Re Entry into congress

తెలంగాణలోని సీనియర్ పొలిటీషియన్లలో ఒకరైన ధర్మపురి శ్రీనివాస్ ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన డీఎస్.. తాజాగా కొడుకు సంజయ్ తో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్ రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు వీహెచ్ సమక్షంలో కాంగ్రెస్ లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్బంగా ఆదివారం ఉదయం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

తొలుత పెద్ద కొడుకు సంజయ్ తో కలిసి డీఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ప్రచారం జరిగింది. దీనిని డీఎస్ ఖండించారు. తన కొడుకు సంజయ్ కాంగ్రెస్ లో చేరుతున్నాడని, తాను మాత్రం బీఆర్ ఎస్ లోనే కొనసాగుతానని ఓ లేఖ విడుదల చేశారు. తన ఇద్దరు కొడుకుల్లో ఒకరు కాంగ్రెస్ లో మరొకరు బీజేపీలో ఉంటూ తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని తెలిపారు. ఆదివారం ఉదయం డీఎస్ గాంధీభవన్ కు చేరుకున్నారు. వీల్ చైర్ పై సహాయకుడి సాయంతో వచ్చిన డీఎస్.. కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తెలిపారు. తన పేరుతో విడుదలైన లేఖతో తనకు సంబంధంలేదని తేల్చిచెప్పారు.

గాంధీభవన్ లో ఏఐసీసీ తెలంగాణ ఇన్ చార్జి మాణిక్ రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావుల సమక్షంలో డీఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. డీఎస్ తో పాటు మేడ్చల్ సత్యనారాయణకు ఠాక్రే కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్, పొన్నాల లక్ష్మయ్య, రేణుకా చౌదరి, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

More Telugu News