NEET: 'నీట్' రాసేందుకు కనీస వయసుపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

  • జాతీయస్థాయిలో వైద్య విద్య ప్రవేశాల కోసం నీట్
  • నీట్ రాసేందుకు కనీస వయసు 17 ఏళ్లు
  • తన కుమార్తెకు 4 రోజుల వయసు తగ్గిందంటూ హైకోర్టును ఆశ్రయించిన వ్యక్తి
  • ఒక్కరోజు తగ్గినా తాము ఏమీ చేయలేమన్న హైకోర్టు
  • నిబంధనను నిబంధనగానే చూడాలని స్పష్టీకరణ
AP High Court comments on NEET Age limit factor

భారత్ లో జాతీయస్థాయిలో వైద్య విద్య కోర్సుల ప్రవేశం కోసం నిర్వహించే అర్హత పరీక్ష... నీట్. దీనికి కనీస వయసు 17 ఏళ్లు. అయితే కడపకు చెందిన 16 ఏళ్ల అమ్మాయి తండ్రి నీట్ కనీస వయసు అంశాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు.

నీట్ కనీస వయసు డిసెంబరు 31 నాటికి 17 ఏళ్లు ఉండాలన్న నిబంధనను కొట్టివేయాలని ఆయన కోర్టును కోరారు. తన కుమార్తెకు 17 ఏళ్ల వయసుకు 4 రోజులు తక్కువగా ఉందని, నీట్ కు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. 

నీట్ రాసేందుకు నిర్దిష్ట వయసును నిబంధనల్లో స్పష్టంగా పేర్కొన్నారని, ఆ అర్హత ప్రమాణానికి ఒక్కరోజు తగ్గినా తాము ఏమీ చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నిరోజులు తగ్గాయనేది ముఖ్యం కాదని, నిబంధనను నిబంధనగానే చూడాలని పేర్కొంది. ఈ అంశంలో తాము జోక్యం చేసుకోలేమంటూ సదరు పిటిషన్ ను కొట్టివేసింది. 

నీట్ కనీస వయసును 17 ఏళ్లు అని పేర్కొనడం సమానత్వపు హక్కును నిరాకరించినట్టు ఎలా అవుతుందని ధర్మాసనం ప్రశ్నించింది. ఉమ్మడి ఏపీ హైకోర్టు 2013, 2017లోనే ఈ విషయాన్ని స్పష్టం చేసిందంటూ, గతంలో దాఖలైన పలు పిటిషన్లను న్యాయస్థానం ఈ సందర్భంగా ప్రస్తావించింది. 

ఈ పిటిషన్ ను హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఆర్.రఘునందన్ రావు ధర్మాసనం విచారించింది. నేషనల్ మెడికల్ కమిషన్ తరఫున న్యాయవాది వివేక్ చంద్రశేఖర్, కేంద్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ హరినాథ్ వాదనలు వినిపించారు.

More Telugu News