Chandrababu: తిరుమలలో గంజాయి కలకలం.. పరిస్థితి ఆవేదన కలిగిస్తోందన్న చంద్రబాబు

  • గంజాయి ప్యాకెట్లతో అధికారులకు పట్టుబడిన కాంట్రాక్ట్ ఉద్యోగి
  • వీడియోను ట్వీట్ చేసిన చంద్రబాబు
  • రాష్ట్రంలో గంజాయి భూతం విస్తరిస్తోందనడానికి ఇదో సాక్ష్యమని వ్యాఖ్య
  • తిరుమల భక్తుల మనోభావాల విషయంలో ప్రభుత్వం బాధ్యతగా స్పందించాలని డిమాండ్
cannabis seized again in tirumala chandrababu responds

తిరుమలలో గంజాయి అక్రమ రవాణా కలకలం రేపుతోంది. లక్ష్మీ శ్రీనివాసం కార్పొరేషన్ సంస్థ తరపున వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగి వద్ద 125 గ్రాముల గంజాయి పట్టుబడింది. కాంట్రాక్ట్ ఉద్యోగి గంగాధరాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకుని తనిఖీ చేయగా చిన్న చిన్న గంజాయి ప్యాకెట్లు లభించాయి. ఎవరికీ అనుమానం రాకుండా గంజాయి ప్యాకెట్లను కాళ్లకు చుట్టుకుని ఉండటం చూసి అధికారులు అవాక్కయ్యారు.

పవిత్రమైన తిరుమల కొండపై గంజాయి రవాణా జరుగుతుండటంపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘తిరుమలలో గంజాయి వార్త షాక్ కు గురిచేసింది. రాష్ట్రంలో గంజాయి భూతం రోజురోజుకూ విస్తరిస్తోందనడానికి ఇదో సాక్ష్యం. పరమ పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి పరిస్థితి అత్యంత ఆవేదన కలిగిస్తోంది’’ అని ఆయన ట్వీట్ చేశారు. భక్తుల మనోభావాల విషయంలో ప్రభుత్వం బాధ్యతగా స్పందించాలని డిమాండ్ చేశారు. 

అంతకుముందు టీడీపీ నేత నారా లోకేశ్ కూడా తీవ్రంగా స్పందించారు. ‘‘అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్.. వైసీపీ పాలనలో గంజాయి ప్రదేశ్ అయ్యింది. బడిలో, గుడిలో గంజాయితో రాష్ట్రం పరువు మంటగలిసిపోయింది. చివరికి ప్రపంచ ప్రఖ్యాత హిందూ ధార్మిక క్షేత్రం తిరుమలలో గంజాయి గుప్పుమంటోంది’’ అని మండిపడ్డారు.

‘‘టీటీడీ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగిని 125 గ్రాముల గంజాయితో ఎస్ఈబీ పట్టుకుంది. దొరకని గంజాయి గజదొంగలు కొండపై ఇంకెందరు ఉన్నారో? ఇందుకా జగన్ నువ్వు ఒక్క ఛాన్స్ అడిగింది?’’ అని ట్విట్టర్ లో నిలదీశారు.

More Telugu News