COVID19: భారత్‌లో నిన్న కొత్తగా 1590 కరోనా కేసులు

  • కొన్ని రోజులుగా రోజువారీ కేసుల సంఖ్య పెరుతోందన్న కేంద్రం 
  • ఆసుపత్రుల్లో చేరుతున్న వారు, మరణాల సంఖ్య యథాతథమని వెల్లడి
  • త్వరలో అన్ని రాష్ట్రాల్లో కొవిడ్ ఏర్పాట్లపై కేంద్రం మాక్ డ్రిల్ 
India records 1590 fresh Covid 19 cases highest in 146 days

భారత్‌లో రోజువారీ నమోదవుతున్న కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం కొత్తగా 1590 కేసులు నమోదయ్యాయి. గత 146 రోజుల లెక్కలతో పోలిస్తే  ఇదే అత్యధికమని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు పేర్కొన్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ తాజా ప్రకటన ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా ఆరు కరోనా మరణాలు సంభవించాయి. మహారాష్ట్రలో ముగ్గురు కరోనాకు బలికాగా కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఒక్కరు చొప్పున కరోనాతో మరణించారు. 

రోజువారి పాజిటివిటీ రేటు 1.33 శాతం ఉండగా.. ఏడు రోజుల సగటు పాజిటివిటీ 1.23 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోందని కేంద్రం వెల్లడించింది. రోజువారీ కేసుల్లో కొద్దిగా పెరుగుదల కనిపించినా ఆసుపత్రుల్లో చేరుతున్న రోగుల సంఖ్యలో ఎటువంటి మార్పూ లేదని పేర్కొంది. మరణాల సంఖ్యలో కూడా మార్పులు లేవని స్పష్టం చేసింది. 

కరోనా కట్టడి కోసం రాష్ట్రాలన్నీ అయిదంచెల వ్యూహం అమలును కొనసాగించాలని చెప్పింది. కరోనా పరీక్షలు నిర్వహించడం, రోగులను గుర్తించడం, సరైన చికిత్స అందించడం, వ్యాక్సినేషన్, మాస్కులు ధరించడం వంటి నియమాలను అమలు చేయాలని చెప్పింది. కొవిడ్ ఏర్పాట్లపై త్వరలో అన్ని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తామని కూడా పేర్కొంది.

More Telugu News