Ysr Asara: రాష్ట్రంలోని నా అక్కాచెల్లెళ్లను చేయి పట్టుకుని నడిపిస్తున్నా: ఏపీ సీఎం జగన్

Ap cm Jaganmohan Reddy released Ysr Asara scheme funds Dwakra women
  • పొదుపు సంఘాలకు రూ.6,419.89 కోట్లు.. ‘వైఎస్సార్ ఆసరా’ పథకం నిధుల విడుదల
  • 78,94,169 మంది అక్కాచెల్లెళ్లకు మంచి జరుగుతుందన్న ముఖ్యమంత్రి
  • ఏలూరు జిల్లాలోని దెందులూరు సభలో వెల్లడించిన జగన్
  • వైఎస్సార్ ఆసరా పండుగ.. పది రోజుల పాటు వేడుకలు
ఆంధ్రప్రదేశ్ లోని పొదుపు సంఘాల మహిళలు దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. పొదుపు సంఘాల్లో వచ్చిన విప్లవాత్మక మార్పు మహిళలు అందరికీ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. రాష్ట్రంలోని అక్కాచెల్లెళ్లను తాను చేయిపట్టుకుని ముందుకు నడిపిస్తున్నట్లు తెలిపారు. ఏలూరు జిల్లాలోని దెందులూరులో నిర్వహించిన కార్యక్రమంలో వైఎస్సార్ ఆసరా పథకం నిధులను ముఖ్యమంత్రి బటన్ నొక్కి విడుదల చేశారు. రాష్ట్రంలోని పొదుపు సంఘాల ఖాతాల్లో రూ.6,419.89 కోట్ల నిధులను జమచేశారు. ఈ నిధులతో పొదుపు సంఘాలకు చెందిన 78,94,169 మంది అక్కాచెల్లెళ్లకు మంచి జరుగుతుందని జగన్ పేర్కొన్నారు.

గత ప్రభుత్వంలో రాష్ట్రంలోని పొదుపు సంఘాలకు సగటున రూ.14 వేల కోట్ల రుణాలు అందించగా.. తమ ప్రభుత్వం ప్రస్తుతం రూ.30 వేల కోట్ల రుణాలు అందిస్తోందని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. పొదుపు సంఘాలకు ఇస్తున్న రుణాలపై వడ్డీని 7 శాతానికి తగ్గించినట్లు పేర్కొన్నారు. వడ్డీని మరింత తగ్గించేందుకు బ్యాంకులతో ప్రభుత్వం చర్చలు జరుపుతోందని, భవిష్యత్తులో వడ్డీని తగ్గించేందుకు బ్యాంకులపై ఒత్తిడి తీసుకొస్తామని జగన్ వివరించారు.

2019 సార్వత్రిక ఎన్నికల నాటికి పొదుపు సంఘాల పేరిట మహిళలకు బ్యాంకుల్లో ఉన్న అప్పు మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఈ అప్పు మొత్తం రూ.25,571 కోట్లు ఉండగా.. ఇప్పటికే రెండు విడతల్లో ఏపీ ప్రభుత్వం రూ.12,758.28 కోట్లను బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. తాజాగా విడుదల చేసిన నిధులను కలుపుకుంటే.. మూడు విడతల్లో రూ.19,178.17 కోట్లను పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో ప్రభుత్వం జమచేసిందని తెలిపారు.

పది రోజులు వేడుకలు..
వైఎస్సార్ ఆసరా మూడో విడత పంపిణీ ఉత్సవాలను పది రోజుల పాటు నిర్వహించనున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 5 వరకు రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగుతాయని వివరించారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.
Ysr Asara
Dwakra Groups
Andhra Pradesh
YSRCP
Jagan
ap cm jagan
dendulure
eluru district

More Telugu News