మా తాత జైలుకెళ్లింది ఇందుకోసం కాదు.. రాహుల్ కు మద్దతుగా అమెరికా చట్టసభ్యుడి స్పందన!

  • ఎంపీగా రాహుల్ ను అనర్హుడిగా ప్రకటించడంపై రో ఖన్నా మండిపాటు
  • గాంధీ తత్వానికి, భారతదేశపు విలువలకు తీవ్ర ద్రోహం చేయడమేనని వ్యాఖ్య
  • ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అధికారం మోదీకి ఉందని ట్వీట్
US Lawmaker fires On Rahul Gandhi Row

2019లో ‘మోదీ’ ఇంటి పేరుపై రాహుల్ చేసిన వ్యాఖ్యలకు సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడం, తర్వాతి రోజే రాహుల్ సభ్యత్వంపై లోక్ సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేయడం తెలిసిందే. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీరుపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండో అమెరికన్ నేత, అమెరికా చట్ట సభ్యుడు రో ఖన్నా తీవ్రంగా స్పందించారు.

‘‘రాహుల్ గాంధీని పార్లమెంట్ నుంచి బహిష్కరించడం.. గాంధీ తత్వానికి, భారతదేశపు విలువలకు తీవ్ర ద్రోహం చేయడమే. మా తాత ఏళ్ల తరబడి జైలు జీవితం గడిపింది ఇందుకోసం కాదు. నరేంద్ర మోదీ.. భారత ప్రజాస్వామ్యం కోసం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అధికారం మీకు ఉంది’’ అని ట్వీట్ చేశారు. న్యూయార్క్ టైమ్స్ లో వచ్చిన కథనాన్ని తీన ట్వీట్ కు జత చేశారు. 

రో ఖన్నా ప్రస్తుతం అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్నారు. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆయన తాత అమర్ నాథ్ విద్యాలంకార్.. భారత స్వాతంత్ర్య పోరాట యోధుడు. లాలా లజపతి రాయ్ వంటి నేతతో కలిసి పని చేశారు. కొన్నేళ్లపాటు జైలు జీవితం కూడా గడిపారు.

మరోవైపు, ఇండియన్ ఓవర్ సీస్ కాంగ్రెస్ వైస్ చైర్మన్ జార్జ్ అబ్రహం స్పందిస్తూ.. ‘‘భారతదేశంలో ప్రజాస్వామ్యానికి ఇది విచారకరమైన రోజు. రాహుల్ గాంధీని అనర్హులుగా ప్రకటించడం ద్వారా.. మోదీ సర్కార్ ప్రతిచోటా భారతీయుల వాక్ స్వాతంత్ర్యం, స్వేచ్ఛ హక్కుకు చరమగీతం పాడుతోంది’’ అని విమర్శించారు.

More Telugu News