ఏపీ హైకోర్టును కర్నూలుకు తరలించే అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

  • రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం అమరావతిలో హైకోర్టు ఏర్పాటయిందన్న కేంద్రం
  • మూడు రాజధానులపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసిందని వ్యాఖ్య
  • హైకోర్టు తరలింపుపై ఏపీ హైకోర్టు అభిప్రాయాలను వెల్లడించాల్సి ఉందన్న కేంద్రం
Shifting of High Court depends on decision of AP High Court says Center

మూడు రాజధానులే తమ లక్ష్యమని చెపుతున్న ఏపీ ప్రభుత్వం హైకోర్టును కర్నూలుకు తరలిస్తామని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. కర్నూలుకు హైకోర్టును తరలించాలనే విషయంలో హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం కలిసి నిర్ణయం తీసుకోవాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. ఏపీ హైకోర్టును తరలించే అంశం న్యాయస్థానాల పరిధిలో ఉందని అన్నారు. 

రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం హైకోర్టు అమరావతిలో ఏర్పాటయిందని చెప్పారు. అమరావతి నుంచి కర్నూలుకు హైకోర్టును తరలించేందుకు ముఖ్యమంత్రి జగన్ ప్రతిపాదించారని... అయితే మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయని తెలిపారు. మూడు రాజధానుల అంశంపై ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను ఇచ్చిందని, అమరావతిలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలంటూ సీఆర్డీఏను ఆదేశించిందని చెప్పారు. హైకోర్టు తరలింపుపై ఏపీ హైకోర్టు అభిప్రాయాలను వెల్లడించాల్సి ఉందని అన్నారు. టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కిరణ్ రిజిజు ఈ మేరకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

More Telugu News