Andhra Pradesh: వసంత కృష్ణ ప్రసాద్ కు, నాకు మధ్య గొడవేం జరగలేదు: పేర్ని నాని

  • మాపై అసత్య, హేయమైన ప్రచారం జరుగుతోందన్న పేర్ని నాని 
  • అసెంబ్లీలో సరదాగా మాట్లాడుకున్నామే తప్ప వివాదమేమీ లేదని వివరణ 
  • సోషల్ మీడియాలో హేయమైన ప్రచారం జరుగుతోందని మండిపాటు
  • అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడిన ఇద్దరు నేతలు
Perni nani and vasantha krishna prasad joint press meet at ap assembly regarding social media messages

సోషల్ మీడియాలో గురువారం ఉదయం నుంచి వసంత కృష్ణ ప్రసాద్ పై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం జరుగుతోందని పేర్ని నాని తెలిపారు. ఇలాంటి హేయమైన ప్రచారాన్ని మీడియా గ్రూపుల్లోనూ ఫార్వార్డ్ చేయడం దురదృష్టకరమని అన్నారు. అసెంబ్లీలో తమ మధ్య జరిగిన సంఘటన వేరు.. బయట ప్రచారం జరుగుతున్నది వేరని పేర్కొన్నారు. ఉదయం 8:45 గంటలకే టంచనుగా వచ్చి కృష్ణ ప్రసాద్ అసెంబ్లీలో కూర్చున్నారని, టీ బ్రేక్ సమయం దాకా ఓటేయడానికి వెళ్లలేదని తెలిపారు. ఇప్పటి వరకు ఓటేయలేదేమని సరదాగా తాను అడిగితే.. ఇప్పుడే వెళుతున్నానని కృష్ణ ప్రసాద్ చెప్పారన్నారు. అంతకుమించి ఏమీ జరగలేదని పేర్ని నాని వివరించారు.

తమ మధ్య జరిగిన సంభాషణ ఇదయితే సోషల్ మీడియాలో మాత్రం హేయమైన భాషలో ప్రచారం జరుగుతోందని పేర్ని నాని వివరించారు. తాను కృష్ణప్రసాద్ ను రాత్రంతా కనబడలేదు ఎక్కడికి వెళ్లారని అడిగినట్లు, దానికి కృష్ణప్రసాద్ తనపై బూతులతో విరుచుకుపడ్డట్లు, ఆ తర్వాత ఫోన్ స్విచ్ఛాప్ చేసుకుని ఆయన ఎక్కడికో పోయినట్లు ప్రచారం జరుగుతోందని నాని తెలిపారు.

ఇదంతా హేయమైన ప్రచారమని, దీనిని మీడియా గ్రూపుల్లోనూ పార్వార్డ్ చేసుకోవడంతో వివరణ ఇచ్చేందుకే కృష్ణ ప్రసాద్ తో కలిసి వచ్చినట్లు తెలిపారు. సోషల్ మీడియాలో ప్రచారం నేపథ్యంలో కృష్ణ ప్రసాద్ తో కలిసి పేర్ని నాని అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. కృష్ణ ప్రసాద్ కూడా ఈ ప్రచారాన్ని ఖండించారు. మీడియా గ్రూపులో స్వయంగా తాను వివరణ ఇచ్చానని తెలిపారు. పేర్ని నాని తనకు సోదరుడని, అన్నా అంటూ వెళితే నిమిషాల్లో ఏ పనైనా చేసి పెడతారని కృష్ణ ప్రసాద్ తెలిపారు.

More Telugu News