Women: మహిళలూ ఈ అనారోగ్య సూచనలను నిర్లక్ష్యం చేయొద్దు..!

Health Complications Women Should Be Careful About After 40
  • 40 ఏళ్లకు వచ్చిన మహిళల్లో ఎన్నో సమస్యలు
  • హార్మోన్ల పనితీరులో మార్పులు
  • మెనోపాజ్ కు దగ్గరయ్యే సమయం
  • ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్, మధుమేహం ముప్పు
  • లక్షణాలు కనిపిస్తే వైద్యుల సూచనలు తీసుకోవాల్సిందే
మహిళలు 40 ఏళ్ల వయసుకు వచ్చిన తర్వాత నుంచి ఎన్నో అనారోగ్యాలు పలకరిస్తుంటాయి. మెనోపాజ్ కు క్రమంగా దగ్గరవుతుంటారు. శారీరక, మానసిక పరమైన మార్పులు చోటు చేసుకుంటాయి. దీనికితోడు వారి జీవనశైలి, ఆహార అలవాట్లు ఆరోగ్యకరంగా లేకపోతే చాలా త్వరగానే సమస్యలు కనిపించొచ్చు. కనుక మహిళలు 40 ఏళ్లకు సమీపిస్తున్న క్రమంలో తమ శరీరంలో కనిపించే మార్పులు, అనారోగ్య లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల సూచనలు పొందడం ఎంతో అవసరం.

కిడ్నీ స్టోన్స్
మూత్రపిండాలలో రాళ్లు ఇలాంటి సమస్యల్లో ఒకటి. ఖనిజాలు రాళ్లుగా మారడమే కిడ్నీ స్టోన్స్. కిడ్నీలో రాళ్లు ఏర్పడితే నడుము భాగం, పొత్తి కడుపు పక్కన తీవ్రమైన నొప్పి వస్తుంది. మూత్రంలో రక్తం కనిపించొచ్చు. లేదంటే మూత్రవిసర్జన తర్వాత చలిగా అనిపించొచ్చు. మూత్ర విసర్జన సమయంలో మండుతున్నా, ఏదో అడ్డు పడినట్టు ఉంటున్నా.. వైద్యులను సంప్రదించాలి. ఇది సులభంగా పరిష్కరించుకోగలిగిన సమస్యే.

ఆర్థరైటిస్
మహిళలకు క్యాల్షియం లోపం ప్రధానమైనదిగా చెప్పుకోవాలి. ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత వారికి క్యాల్షియం లోపం ఎక్కువవుతుంది. ఎముకల్లో సాంద్రత తగ్గుతుంది. దీంతో కీళ్లల్లో నొప్పులు కనిపిస్తాయి. 

మధుమేహం
మధుమేహం 40 ఏళ్లకే రావాలనేమీ లేదు. చాలా ముందుగానే రావచ్చు. లేదంటే 40-50 ఏళ్ల మధ్యలోనూ కనిపించొచ్చు. ముఖ్యంగా ఆహార అలవాట్లు, జీవనశైలి, వంశ చరిత్ర మధుమేహానికి కారణాలు. బాగా అలసిపోయినట్టు ఉంటున్నా, బాగా దాహం అనిపిస్తున్నా, తరచూ మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తున్నా, కంటి చూపు మసక బారుతున్నా, బరువు తగ్గుతున్నా, చిగుళ్ల సమస్యలు కనిపిస్తున్నా, గాయాలు త్వరగా మానకపోయినా.. మధుమేహం ఉన్నదీ, లేనిదీ నిర్ధారించుకోవాలి.  

ఆస్టియోపోరోసిస్
ఆర్థరైటిస్ సమస్యలో చెప్పుకున్నట్టు 40 ఏళ్లు దాటిన తర్వాత మహిళల ఎముకల్లో సాంద్రత తోలపిస్తుంది. హార్మోన్లలో మార్పులు ఇందుకు కారణం అవుతాయి. కనుక క్యాల్షియం, విటమిన్ డీ లోపం లేకుండా ఈ వయసు వారు జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే మోకాళ్లు త్వరగా అరిగిపోతాయి.

అధిక రక్తపోటు
ఇది కూడా జీవనశైలి, ఆహార అలవాట్లతో వచ్చేదే. అధిక రక్తపోటును నియంత్రించుకోకపోతే అది పక్షవాతం లేదా బ్రెయిన్ స్ట్రోక్ కు దారితీయవచ్చు. అధిక రక్తపోటు కిడ్నీల పనితీరు, గుండె పనితీరును తగ్గించేస్తుంది. దీంతో అవి విఫలమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. పోషకాహారం, రోజువారీ వ్యాయామం రక్తపోటు నియంత్రణకు సాయపడతాయి.

స్థూలకాయం
కొన్నేళ్ల క్రితంతో పోలిస్తే నేడు మహిళల్లో స్థూలకాయం సమస్య పెరిగిపోయింది. ఒబెసిటీ కారణంగా థైరాయిడ్ సమస్యలు ఎదురుకావచ్చు. దీర్ఘకాలం పాటు అధిక బరువుతో ఉన్న వారికి కేన్సర్ రిస్క్ కూడా ఉంటున్నట్టు ఇటీవలి ఒక అధ్యయనం సైతం హెచ్చరించింది. కనుక 40కి చేరిన మహిళలు తమ ఎత్తు, బరువు నిర్ణీత పరిమితికి మించి లేకుండా జాగ్రత్త పడాలి.
Women
Health Complications
Careful
40 years
menopause

More Telugu News