స్నేహితుల మధ్య రూ.50 కోసం గొడవ.. కత్తిపోట్లకు దారితీసిన వైనం!

  • బీహార్ నుంచి వచ్చి చార్మినార్ ప్రాంతంలో ఉంటున్న వాహిద్‌, దిల్‌షాద్‌
  • వాహిద్‌ తో రూ.50 అప్పుగా తీసుకున్న దిల్‌షాద్‌
  • ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ.. కత్తితో పొడిచి పారిపోయిన దిల్ షాద్
man stabs friend for mere rs 50 in hyderabad

స్నేహితుల మధ్య రూ.50 కోసం మొదలైన గొడవ.. మాటామాటా పెరిగి కత్తిపోట్లకు దారితీసింది. హైదరాబాద్ లోని చార్మినార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిందీ ఘటన. బీహార్ కు చెందిన వాహిద్‌, దిల్‌షాద్‌ స్థానిక గులాబ్‌ సింగ్‌ బౌలి ప్రాంతంలో నివాసముంటున్నారు. బతుకుదెరువు కోసం వచ్చి సిటీ కాలేజీ క్రాస్‌ రోడ్డులో పెట్రోల్‌ బంక్‌లో పని చేస్తున్నారు. వాహిద్‌ (23) వద్ద దిల్‌షాద్‌ ఈ నెల 20న సాయంత్రం రూ.50 అప్పుగా తీసుకున్నాడు.

అయితే దిల్‌షాద్‌ డబ్బులు ఇవ్వకపోవడంతో వాహిద్‌ వెళ్లి అడిగాడు. దీంతో దిల్‌షాద్‌ తన వద్ద ఉన్న చేతి గడియారం వాహిద్‌కు ఇచ్చి.. డబ్బు చెల్లించిన తర్వాత దాన్ని తీసుకుంటానని చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత వచ్చి.. ఆ గడియారం తన సెంటిమెంట్‌ అని చెప్పి వెనక్కి తీసుకున్నాడు. కానీ వాచ్ పనిచేయకపోవడంతో కావాలనే పాడుచేశావని వాహిద్‌తో దిల్ షాద్ గొడవకు దిగాడు.

ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. దిల్‌షాద్‌ తన సోదరుడి ఇంట్లో నుంచి కత్తి తీసుకువచ్చి వాహిద్‌ ను రెండు సార్లు పొడిచి పారిపోయాడు. వాహిద్‌కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వాహిద్‌ పరిస్థితి మెరుగ్గా ఉందని ఇన్‌స్పెక్టర్‌ గురునాయుడు తెలిపారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

More Telugu News