COVID19: దేశంలో మళ్లీ కరోనా వ్యాప్తి... ముగిసిన ప్రధాని హైలెవల్ మీటింగ్

  • భారత్ లో నిత్యం 1000కి పైగా కరోనా కేసులు
  • అప్రమత్తమైన కేంద్రం
  • ప్రధాని మోదీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం
Modi chaired high level meeting over Covid concludes

భారత్ లో మరోసారి కరోనా రోజువారీ కేసుల సంఖ్యలో పెరుగుదల నమోదవుతోంది. మరణాలు కూడా సంభవించడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఈ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్పందిస్తూ, దేశంలో కరోనా ఇంకా ముగియలేదని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. 

కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మాస్కులు ధరించడం, పరిశుభ్రత తదితర మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించేలా చూడాలన్నారు. ముఖ్యంగా, వృద్ధులు, ఇతర జబ్బులతో బాధపడేవారు కరోనా పట్ల నిర్లక్ష్యం వహించరాదని మోదీ తెలిపారు. వారు రద్దీ ప్రాంతాల్లో కచ్చితంగా మాస్కులు ధరించాలని పేర్కొన్నారు. 

కరోనాను ఐదంచెల వ్యూహంతో కట్టడి చేయాలని చెప్పారు. టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీట్ మెంట్, మాస్కులు తదితర జాగ్రత్తలు తీసుకోవడం, వేరియంట్లపై నిఘా వంటి ఐదు అంశాల ప్రాతిపదికన కరోనాను ఎదుర్కోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. 

ఎప్పటికప్పుడు కరోనా శాంపిళ్లకు జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు చేయిస్తుండాలని, తద్వారా కొత్త వేరియంట్లను గుర్తించవచ్చని వివరించారు.

More Telugu News