Mohan Babu: నేను పడిన కష్టాలు పగవాడికి కూడా రాకూడదు: మోహన్ బాబు

  • విలక్షణ నటుడిగా మోహన్ బాబు సుదీర్ఘ ప్రయాణం 
  • విలన్ గాను .. హీరోగాను ఆడియన్స్ ఆదరించడం పట్ల హర్షం 
  • తనతోనే మేనరిజమ్స్ మొదలయ్యాయని వెల్లడి 
  • తనకి సంతృప్తినిచ్చిన సినిమాల గురించిన ప్రస్తావన 

Mohan Babu Interview

తెలుగు తెరపై విలక్షణ నటుడిగా మోహన్ బాబు ఒక వెలుగు వెలిగారు. ఈ మధ్య కాలంలో మాత్రం ఆయన సినిమాల సంఖ్యను తగ్గించుకున్నారు. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోహన్ బాబు మాట్లాడుతూ .. 'నటుడిగా నేను సక్సెస్ కావడానికి కారణం నా హార్డు వర్క్ .. ఆ పై భగవంతుడి ఆశీస్సులు. నటుడిగా నిలదొక్కుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డాను. నా కష్టాలు పగవాడికి కూడా రాకూడదు. నేను చేసిన మంచి పనుల వలన నా బిడ్డలు బాగుండాలి" అని అన్నారు.

"నేను విలన్ గా చేశాను .. కమెడియన్ గా చేశాను .. కామెడీ విలన్ గాను చేశాను .. హీరోగాను చేశాను. ఎలా చేసినా ప్రేక్షకులు ఆదరించారు. ఇది చాలా అరుదైన విషయమని అన్నగారు అంటూ ఉండేవారు. మేనరిజమ్స్ అనేవి నాతోనే స్టార్ట్ అయ్యాయి. అప్పట్లో నా మేనరిజమ్స్ బాగా పాప్యులర్ అయ్యాయి. 'అల్లుడు గారు' .. 'అసెంబ్లీ రౌడీ' .. 'అల్లరి మొగుడు' .. 'మేజర్ చంద్రకాంత్' .. ఇలా హీరోగా నాకు సంతృప్తిని ఇచ్చిన సినిమాలు కొన్ని ఉన్నాయి" అని చెప్పారు. 

"హీరో అయిన తరువాత కొన్ని సినిమాలు ఫ్లాప్ అయితే మళ్లీ వెనక్కి వచ్చి విలన్ గా చేయవలసి వచ్చింది. హీరో అయిన తరువాత విలన్ గా చేయవలసి వచ్చిందే అని నేను ఏ రోజునా సిగ్గుపడలేదు. నటుడు అనేవాడు అన్ని రకాల పాత్రలను చేయాలి. అలా చేసే అవకాశం రావడం .. ప్రేక్షకులు ఆదరించడం గొప్ప విషయం" అని చెప్పుకొచ్చారు. 

More Telugu News