తెలంగాణకు భారీ ప్రాజెక్టును ప్రకటించిన ప్రధాని మోదీ

PM Modi announces  PM Mitra textile Park for Telangana
  • పీఎం మిత్ర టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన
  • తెలంగాణ సహా ఏడు రాష్ట్రాల్లో టెక్స్ టైల్ పార్కులు
  • వీటితో లక్షలాది మందికి ఉపాధి, వేలాది ఉద్యోగాలు
తెలంగాణలోని అధికార బీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీ మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. మోదీపై బీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబంపై బీజేపీ తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో తెలంగాణకు కేంద్రం మెగా ప్రాజెక్టును ప్రకటించింది. పీఎం మిత్ర టెక్స్ టైల్ పార్క్ ను తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో పీఎం మిత్ర (ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్ టైల్ రీజియన్ అండ్ అపారెల్ పార్క్) టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇందులో తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి.

టెక్స్ టైల్  పార్క్ ఏర్పాటుతో లక్షలాదిమంది రైతులకు, చేనేత కార్మికులకు ఉపాది, వేలాదిమంది యువతకు ఉద్యోగాలు లభించనున్నాయి. పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్కులు టెక్స్‌ టైల్స్ రంగానికి అత్యాధునిక మౌలిక సదుపాయాలను కల్పిస్తాయని మోదీ చెప్పారు.. కోట్లాది పెట్టుబడులను ఆకర్షిస్తాయని, లక్షలాది ఉద్యోగాలను సృష్టిస్తాయని తెలిపారు. ఇది 'మేక్ ఇన్ ఇండియా', 'మేక్ ఫర్ ది వరల్డ్'కి గొప్ప ఉదాహరణ అవుతుందని ట్విట్టర్ లో పేర్కొన్నారు.  ఈ పార్క్ ప్రధానమంత్రి మోదీ తెలంగాణకు అందించిన కానుక అని కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజల తరపున ప్రధాని మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Go Back to Shorts
Narendra Modi
BJP
BRS
Telangana
pm mitra
textile park

More Telugu News