BJP: గన్ పార్క్ వద్ద బండి సంజయ్ దీక్ష.. చుట్టుముట్టిన పోలీసులు

  • పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణకు డిమాండ్
  • మంత్రి కేటీఆర్ ను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని నినాదాలు
  • అక్కడి నుంచి వెళ్లిపోవాలని నేతలకు చెప్పిన పోలీసులు
bandi sanjay protest at gunpark over tspsc paper leakage

టీఎస్ పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ హైదరాబాద్ నాంపల్లిలోని గన్ పార్క్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. పరీక్ష పత్రాల లీకేజీకి ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు బాధ్యులని, ఆయనని క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మొదట ఈ ఉదయం బీజేపీ కార్యాలయంలో దీక్ష చేపట్టాలని సంజయ్ నిర్ణయించారు. కానీ, గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి వచ్చే క్రమంలో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. దాంతో, సంజయ్ అక్కడే దీక్ష చేపట్టారు.

సంజయ్ తో పాటు మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యేలు కూన శ్రీశైలం గౌడ్, నందీశ్వర్ గౌడ్, పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి, జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఆకుల విజయ, పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు దీక్షలో కూర్చున్నారు. ప్రభుత్వం, మంత్రి కేటీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. గన్ పార్క్ చుట్టూ భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు బీజేపీ నేతలకు చెబుతున్నారు. కానీ, లీకేజీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టి, మంత్రి కేటీఆర్ ను పదవి నుంచి తొలగించే వరకూ కదిలేది లేదని సంజయ్, బీజేపీ నాయకులు స్పష్టం చేశారు. దాంతో, అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సంజయ్, ఇతర నేతలను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది.

More Telugu News