badminton: పుల్లెల గోపీచంద్ కూతురు గాయత్రి సంచలనం

Pullela gayatri sensational performance in All england championship
  • ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్స్ చేరిన గాయత్రి-ట్రీసా జంట
  • ప్రి క్వార్టర్స్ లో ప్రపంచ మాజీ నం.1 జోడీపై గెలుపు
  • కిదాంబి శ్రీకాంత్, ప్రణయ్, లక్ష్యసేన్ ఓటమి
భారత బ్యాడ్మింటన్ గురు పుల్లెల గోపీచంద్ కూతురు పుల్లెల గాయత్రి అద్భుత ప్రదర్శన చేసింది. ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్ లో అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఆమె మహిళల డబుల్స్ లో ట్రీసా జాలీతో కలిసి క్వార్టర్ ఫైనల్ కు దూసుకెళ్లింది. ప్రీ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మాజీ నంబర్ వన్, ఆల్ ఇంగ్లండ్ మాజీ చాంపియన్లకు చెక్ పెట్టి సంచలనం సృష్టించింది. మహిళల డబుల్స్ ప్రీ క్వార్టర్స్ లో గాయత్రి జంట 21-14, 24-22తో జపాన్‌ ద్వయం యుకీ ఫుషిమా-సయాకపై గెలిచింది. క్వార్టర్స్ లో చైనా ద్వయం లీ వెన్‌ మీ-లూ గ్జువాన్‌తో గాయత్రి జంట అమీతుమీ తేల్చుకోనుంది.

మరోవైపు భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత సింగిల్స్‌ స్టార్లు కిదాంబి శ్రీకాంత్‌, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌, లక్ష్యసేన్‌ నిరాశ పరిచారు. పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్లో లక్ష్యసేన్‌ 13-21, 15-21తో ఆండ్రెస్‌ అంటాన్‌సెన్‌ (డెన్మార్క్‌) చేతిలో చిత్తయ్యాడు. శ్రీకాంత్‌ 17-21, 15-21తో కొడాయి నరవొక (జపాన్‌) చేతిలో ఓడిపోగా..  ప్రణయ్‌ 20-22, 21-15, 17-21తో ఆంథోనీ గింటింగ్‌ (ఇండోనేసియా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. పురుషుల డబుల్స్‌ లో టాప్ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ షెట్టి కూడా రెండో రౌండ్ లోనే వెనుదిరిగింది. ఆరోసీడ్‌ సాత్విక్‌-చిరాగ్‌ జంట 21-10, 17-21, 19-21తో చైనా జోడీ లియాంగ్‌-వాంగ్‌ చాంగ్‌ చేతిలో పోరాడి ఓడింది. ఈ టోర్నీలో పుల్లెల గాయత్రి-ట్రీసా జంట మాత్రమే మిగిలి భారత ఆశలను సజీవంగా నిలిపింది.
badminton
Pullela Gopichand
pullela gayatri
kidambi srikanth
All england

More Telugu News