Andhra Pradesh: ఏపీ ఆలయాల్లో తలనీలాల టికెట్ ధర.. క్షురకుల కనీస కమిషన్ రూ 20 వేలు!

  • ప్రస్తుతం రూ. 25గా ఉన్న టికెట్ ధర
  • రూ. 40కి పెంచుతూ ఉత్తర్వులు జారీ
  •  టికెట్ల ఆదాయం అంతా క్షురకులకే 
AP Govt Hikes Hair Offering Ticket Rates in Temples

దేవాదాయశాఖ పరిధిలోకి వచ్చే ఆలయాల్లో తలనీలాల టికెట్ ధరలను పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రూ. 25గా ఉన్న టికెట్ ధరను రూ. 40కి పెంచింది. అలాగే, తలనీలాల విధులు నిర్వర్తించే క్షురకులకు నెలకు కనీసం రూ. 20 వేల చొప్పున కమిషన్ ఇవ్వాలంటూ దేవాదాయశాఖ ఇన్‌చార్జ్ ముఖ్యకార్యదర్శి ఎం.హరిజవహర్‌లాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం భక్తుల నుంచి వసూలు చేస్తున్న రూ. 25 ద్వారా వచ్చే ఆదాయాన్ని క్షురకులకు ఇస్తున్నారు. 

టికెట్లపై వచ్చే ఆదాయం మొత్తం వారికే..
అయితే, ఈ మొత్తం సరిపోవడం లేదని, ఏళ్ల తరబడి విధులు నిర్వర్తిస్తున్న తమకు రెగ్యులర్ ఉద్యోగుల్లానే కనీస వేతనం ఇవ్వాలంటూ చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం పెంచిన టికెట్ ధర రూ. 40 ద్వారా వచ్చే ఆదాయం మొత్తాన్ని క్షురకులకే ఇస్తారు. అంటే తలనీలాల టికెట్లపై వచ్చే ఆదాయాన్ని ఆలయంలోని క్షురకులందరికీ సమానంగా పంచుతారు. 

సరిపోకపోతే ఇలా చేస్తారు
అలా పంచినప్పుడు ఒకవేళ వారి కమిషన్ రూ. 20 వేల కంటే తక్కువగా వస్తే అప్పుడు తలనీలాల విక్రయం ద్వారా వచ్చిన ఆదాయం నుంచి మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తారు. అవి కూడా సరిపోని పక్షంలో ఆలయ ఆదాయంలో మూడు శాతం కమిషన్‌ను వినియోగించుకోవచ్చు. అప్పటికీ సరిపోకుంటే మిగిలిన మొత్తం కోసం ఆలయ అధికారులు కమిషనర్ ద్వారా ప్రభుత్వాన్ని సంప్రదించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

ఇలాగైతేనే వర్తిస్తుంది
గతేడాది జనవరి నుంచి పనిచేస్తున్న క్షురకులకే ఇది వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాదు, ఆలయాల్లోని క్షురకులకు ఏడాదిలో కనీసం 100 రోజుల పని ఉంటేనే ఇది వర్తిస్తుందని కూడా పేర్కొంది. కాగా, రాష్ట్రంలో దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చే ఆలయాల్లో కేశఖండన విధులు నిర్వర్తించే క్షురకులు 1,100 మంది ఉంటారని తెలుస్తోంది.

More Telugu News