Richard Carpenter: అమెరికా సంగీత దిగ్గజం స్పందనకు కీరవాణి కంట కన్నీరు

Keeravani gets emotional after Richard Carpenter post in Instagram
  • ఇటీవల నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు
  • ఆస్కార్ వేదికపై 'టాప్ ఆఫ్ ద వరల్డ్' పాట ఆలపించిన కీరవాణి
  • ది కార్పెంటర్స్ మ్యూజిక్ బ్యాండ్ ను స్మరించుకున్న వైనం
  • కీరవాణికి అభినందనలు తెలిపిన రిచర్డ్ కార్పెంటర్
  • కీరవాణి తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యాడన్న రాజమౌళి
పాశ్చాత్య సంగీతంలో ది కార్పెంటర్స్ మ్యూజిక్ బ్యాండ్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. రిచర్డ్ కార్పెంటర్, కరెన్ కార్పెంటర్ అనే తోబుట్టువులు ఈ బ్యాండ్ లో ముఖ్యులు. 60, 70వ దశకాల్లో రిచర్డ్ కార్పెంటర్ తన సోదరి కరెన్ తో కలిసి రూపొందించిన పాటలు నాటి యువతను ఉర్రూతలూగించాయి. పలు సింగిల్స్, ఆల్బమ్స్ తో ఈ అమెరికా ద్వయం ప్రపంచ సంగీత యవనికపై తమదైన ముద్ర వేసింది. 

ఇటీవల ఆర్ఆర్ఆర్ చిత్రానికి గాను నాటు నాటు పాట ఆస్కార్ గెలిచిన వేళ సంగీత దర్శకుడు కీరవాణి వేదికపై ఆలపించిన 'టాప్ ఆఫ్ ద వరల్డ్' అనే గీతం కార్పెంటర్స్ రూపొందించినదే. ఆ పాటను కీరవాణి తనదైన శైలిలో కాస్త పదాలు మార్చి పాడారు.

ఈ నేపథ్యంలో, రిచర్డ్ కార్పెంటర్ సోషల్ మీడియా వేదికగా కీరవాణిని, గీత రచయిత చంద్రబోస్ ను సర్ ప్రైజ్ చేశారు. వారిద్దరినీ అభినందిస్తూ పోస్టు చేశారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ గెలిచినందుకు హృదయపూర్వక అభినందనలు అంటూ విషెస్ తెలిపారు. 

అంతేకాదు, మా కుటుంబం నుంచి ఓ చిన్న కానుక అంటూ స్వయంగా కీబోర్డు వాయిస్తూ 'టాప్ ఆఫ్ ద వరల్డ్' గీతాన్ని ఆలపించారు. రిచర్డ్ కార్పెంటర్ తో పాటు ఆయన కుమార్తెలు కూడా ఈ పాటకు గొంతు కలిపారు. ఈ వీడియోను రిచర్డ్ కార్పెంటర్ తన పోస్టుకు జోడించారు. 

కాగా, రిచర్డ్ కార్పెంటర్ ఇన్ స్టాగ్రామ్ లో చేసిన ఈ పోస్టుతో కీరవాణి తీవ్ర భావోద్వేగాలకు గురయ్యారు. ఈ విషయాన్ని దర్శకుడు రాజమౌళి వెల్లడించారు. 

"సర్... మా అన్నయ్య ఆస్కార్ ప్రమోషన్స్ లో ఎక్కడా ఎమోషనల్ కాలేదు. ఆస్కార్ వేడుక ముందు, ఆ తర్వాత కూడా ఆయన భావోద్వేగాలకు గురికాలేదు. కానీ మీ పోస్టు చూశాక మాత్రం ఆయన భావోద్వేగాలను అదుపులో పెట్టుకోలేకపోయారు... మీ పోస్టుతో కన్నీళ్లు పెట్టుకున్నారు" అంటూ రిచర్డ్ కార్పెంటర్ కు రిప్లయ్ ఇచ్చారు. మీరు స్పందించిన విధానం మా కుటుంబానికి ఒక మధురానుభూతి అని రాజమౌళి పేర్కొన్నారు.
Richard Carpenter
Keeravani
Rajamouli
Oscar
Naatu Naatu
RRR
USA
Tollywood

More Telugu News