Bandi Sanjay: వారిని విడిచిపెట్టకపోతే తీవ్ర పరిణామాలుంటాయని ప్రభుత్వానికి బండి సంజయ్ హెచ్చరిక

Bandi Sanjay warns government over arrest BJYM members
  • కేసును నీరుగార్చేందుకే పేపర్ లీకేజీ దర్యాప్తును సిట్ కు అప్పగించారన్న బీజేపీ అధ్యక్షుడు 
  • సిట్ దర్యాప్తు చేసిన నయీం, డ్రగ్స్, డేటా చోరీ కేసులు నీరుగారిపోయాయని విమర్శ
  • టీఎస్పీఎస్సీ బోర్డు వద్ద ఆందోళన చేసిన బీజేవైఎం కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ కేసులను ఖండించిన సంజయ్
తెలంగాణను కుదిపేస్తున్న టీఎస్పీఎస్సీ ప్రశ్నా పత్రాల లీకేజీ కేసును సిట్ కు అప్పగించడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తప్పుబట్టారు. కేసును నీరుగార్చేందుకే ప్రభుత్వం దీన్ని సిట్ కు అప్పగించిందని విమర్శించారు. ‘ప్రశ్నాపత్రాల లీకేజీ అంశంపై రాష్ర ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేయడం తప్పుడు చర్య. నయీం కేసు, డ్రగ్స్ కేసు, డేటా చోరీ సహా సిట్ కు అప్పగించిన కేసులన్నీ నీరుగారిపోయాయి. ఈ అంశంపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఈ అంశంపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని ట్వీట్ చేశారు. 

ఇక, టీఎస్పీఎస్సీ బోర్డు వద్ద ఆందోళన చేసిన బీజేవైఎం కార్యకర్తలపై నాన్ బెయిలెబుల్ కేసులు పెట్టడాన్ని ఖండించారు. వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ‘బీజేవైఎం కార్యకర్తలపై నాన్ బెయిలెబుల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న వాళ్లను వదిలేసి న్యాయం కోసం పోరాడుతున్న బీజేవైఎం కార్యకర్తలను అరెస్ట్ చేయడమేంటి?. అరెస్టులు, జైళ్లు బీజేపీ కార్యకర్తలకు కొత్తకాదు. నమ్మిన సిద్ధాంతం కోసం, ప్రజల పక్షాన ఎంతకైనా పోరాడతాం’ అని పేర్కొన్నారు.  

ప్రశ్నాపత్రాల లీకేజీతో లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలు ప్రమాదంలో పడ్డాయని, అందుకు కారకులైన వారిని వదిలేసి, పోరాడుతున్న వారిపై కేసులు పెట్టడం సిగ్గు చేటని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ‘అరెస్ట్ చేసిన బీజేవైఎం కార్యకర్తలందరినీ తక్షణమే బేషరతుగా విడుదల చేయాలి. లేనిపక్షంలో ప్రభుత్వం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని బండి సంజయ్ ఒక ప్రకటనలో హెచ్చరించారు.
Bandi Sanjay
Telangana
Police
bip
bjym

More Telugu News