Adnan Sami: జగన్ పై అద్నాన్ సమీ తీవ్ర విమర్శలు.. మండిపడుతున్న నెటిజన్లు!

  • ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ రావడంతో తెలుగు ఖ్యాతి రెపరెపలాడుతోందని జగన్ ట్వీట్
  • బావిలోని కప్ప మనస్తత్వం అంటూ ఆరోపించిన అద్నాన్ సమీ
  • ప్రాంతీయ విభజనలను సృష్టిస్తున్నారని మండిపాటు
  • తీవ్రంగా స్పందిస్తున్న నెటిజన్లు
Adnan Sami Calls Andhra Chief Minister Regional Minded Frog

ఆర్ఆర్ఆర్ లోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో చిత్ర బృందానికి అభినందనలు వెల్లువెత్తాయి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా అభినందించారు. అయితే ఆయన చేసిన ట్వీట్ పై గాయకుడు అద్నాన్ సమీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగు ఖ్యాతి రెపరెపలాడుతోందన్న జగన్ వ్యాఖ్యను తప్పుబట్టారు. 

‘బావిలోని కప్ప మనస్తత్వం’ అంటూ ఆరోపణలు చేశారు. ‘‘సముద్రం గురించి ఆలోచించలేని, ప్రాంతీయ మనస్తత్వం ఉన్న చెరువులో కప్ప!! ప్రాంతీయ విభజనలను సృష్టిస్తున్నందుకు, దేశానికి దక్కిన గౌరవాన్ని అందుకోలేకపోతున్నందుకు సిగ్గుపడు. జై హింద్!!’’ అంటూ ట్వీట్ చేశారు. 

దీంతో అద్నాన్ సమీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపై విమర్శలు చేయడం మానుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. హద్దులు తెలుసుకుని మాట్లాడాలని సూచిస్తున్నారు. ‘‘ఒక తెలుగు పాట అవార్డు దక్కించుకుంది. ఓ తెలుగు వ్యక్తి గర్వపడ్డాడు. ఇందులో అవమానించడానికి ఏముంది? మధ్యలో నీకేంటి నొప్పి?’’ అని ప్రశ్నిస్తున్నారు.

‘‘ఏంటి నీ సమస్య? ఇండియా గురించి నీకు ఏం తెలుసు? భారత పౌరసత్వం పొందినంత మాత్రాన.. మమ్మల్ని ఆదేశించేంత అధికారం నీకు వచ్చిందని అనుకుంటున్నావా? ఇండియా అంటే రాష్ట్రాల కలయిక. ఆయన (జగన్) ది భాషాభిమానం.. విభజన కాదు’’ అని ఓ యూజర్ హితవు పలికారు. 

తీవ్ర విమర్శల నేపథ్యంలో అద్నాన్ సమీ మరో ట్వీట్ చేశారు. ఒక భాషను అగౌరవపరచడం తన ఉద్దేశం కాదని చెప్పారు. ‘‘నేను మాట్లాడేది భాష గురించి కాదు. నా ఉద్దేశం చాలా సింపుల్.. ‘ఇండియన్ ఫస్ట్’ అనే గొడుగు కిందికే అన్ని భాషలు వస్తాయి. భారతీయత తర్వాతే ఏదైనా. అంతే. నేను కూడా ప్రాంతీయ భాషల్లో ఎన్నో పాటలు పాడాను. అన్నింటినీ ఒకే విధమైన కృషితో, అన్ని భాషలపై సమానమైన గౌరవంతో పాడాను’’ అని వివరణ ఇచ్చారు.

More Telugu News