Oscars 2023: చరిత్ర సృష్టించిన తెలుగు సినిమా.. ‘నాటునాటు’ను వరించిన ఆస్కార్

RRR Song Natu Natu Got Oscar Award in Best Original Song Category
  • బెస్ట్ ఒరిజనల్ సాంగ్ విభాగంలో 'నాటునాటు'కు అవార్డు ప్రకటన
  • ప్రకటన రాగానే హోరెత్తిపోయిన ఆస్కార్ థియేటర్
  • ఆనందోత్సాహాల్లో  తెలుగు చిత్ర పరిశ్రమ
తెలుగు సినిమా చరిత్ర సృష్టించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అయిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటునాటు’ పాటకు ఆస్కార్ అవార్డు లభించింది. ఈ పాటకు మొదటి నుంచి గట్టి పోటీ నిచ్చిన టెల్ ఇట్ లైక్ ఎ విమెన్ సినిమాలోని ‘అప్లాజ్’, బ్లాక్ పాంథర్: వకాండా ఫరెవర్ సినిమాలోని ‘లిఫ్ట్ మి అప్’, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ సినిమాలోని ‘దిస్ ఈజ్ లైఫ్’, టాప్ గన్ మావెరిక్ సినిమాలోని ‘హోల్డ్ మై హ్యాండ్’ పాటలను వెనక్కి నెట్టి మరీ ‘నాటునాటు’ పాట ఆస్కార్ దక్కించుకుంది.

బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటునాటు’కు అవార్డు ప్రకటించగానే థియేటర్ దద్దరిల్లిపోయింది. మరోవైపు, లైవ్‌లో చూస్తున్న తెలుగు సినీ అభిమానులు ఆనందంతో పులకరించిపోయారు. ఆస్కార్ అవార్డు అందుకున్న ‘ఆర్ఆర్ఆర్’ బృందం ఆనంద డోలికల్లో తేలియాడుతోంది.

నాటునాటు పాటను చంద్రబోస్ రాయగా రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించారు. ట్రిపుల్ ఆర్ సినిమా 24 మార్చి 2022న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటించిన ఈ సినిమా అప్పట్లో ప్రభంజనం సృష్టించింది. ఈ పాటకు వారు చేసిన డ్యాన్స్‌కు ప్రపంచం మొత్తం ఫిదా అయింది. 

తెలుగు సినిమా పాట ఆస్కార్‌కు నామినేట్ కావడం, అవార్డు దక్కించుకోవడం ఇదే తొలిసారి. దీంతో తెలుగోడు గర్వంతో తలెత్తుకుంటున్నాడు. టాలీవుడ్‌లో అప్పుడే సంబరాలు మొదలయ్యాయి. దర్శక దిగ్గజం రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, పాటల రచయిత చంద్రబోస్, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌, ఇతర చిత్రబృందానికి శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.
Oscars 2023
RRR
Natu Natu
Rajamouli
Ramcharan
Jr NTR

More Telugu News