Team India: సెంచరీ దిశగా కోహ్లీ.. 362/4తో లంచ్ కు వెళ్లిన భారత్

Virat kohli aproching century in 4th test
  • తొలి సెషన్ లో  వికెట్ నష్టపోయి 73 పరుగులు రాబట్టిన టీమిండియా
  • జడేజాను ఔట్ చేసిన మర్ఫీ
  • ప్రస్తుతం క్రీజులో కోహ్లీకి తోడుగా ఉన్న కేఎస్ భరత్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో ఆధిక్యం సాధించే దిశగా టీమిండియా దూసుకెళ్తోంది. ఓపెనర్ శుబ్ మన్ గిల్ శతకంతో వేసిన పునాదిపై సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్తున్నాడు. మూడేళ్ల తర్వాత టెస్ట్ మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ అందుకునేలా ఉన్నాడు. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆదివారం, నాలుగో రోజు ఓవర్ నైట్ స్కోరు 289/3తో ఆట కొనసాగించిన భారత్ 362/4 స్కోరుతో లంచ్ బ్రేక్ కు వెళ్లింది. స్కోరు 300 దాటిన కాసేపటికే ఓవర్ నైట్ బ్యాటర్ రవీంద్ర జడేజా (28)ను ఖవాజా క్యాచ్ ద్వారా మర్ఫీ పెవిలియన్ చేర్చాడు. 

క్రీజులో కుదురుకున్న విరాట్ కోహ్లీకి తెలుగు ఆటగాడు కేఎస్ భరత్ తోడయ్యాడు. ఈ ఇద్దరూ మరో వికెట్ పడకుండా జట్టును లంచ్  వరకు తీసుకెళ్లారు. ప్రస్తుతం కోహ్లీ 88 పరుగులు, భరత్ 25 పరుగులతో ఉన్నారు. సెంచరీకి కోహ్లీ మరో 12 పరుగుల దూరంలో ఉన్నాడు. అతను చివరగా 2019లో ఈడెన్ గార్డెన్స్ లో బంగ్లాదేశ్ పై శతకం సాధించాడు. కాగా, ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరు (480)కు భారత్ ఇంకా 118 పరుగుల దూరంలో ఉంది. మొత్తంగా తొలి సెషన్ లో ఒక వికెట్ నష్టపోయి 73 పరుగులు రాబట్టింది.
Team India
Australia
Virat Kohli
test
ahmedabad

More Telugu News