Pawan Kalyan: ఒక బీసీని ఎన్నికల్లో నిలబెడితే మిగతా బీసీలంతా ఎందుకు గెలిపించరు?: పవన్ కల్యాణ్

  • మంగళగిరిలో బీసీ సదస్సు
  • హాజరైన పవన్ కల్యాణ్
  • తాను ఏ ఒక్క కులానికో పరిమితం కాదని వెల్లడి
  • బీసీ కులాల ఐక్యతకు పిలుపునిచ్చిన పవన్
  • ఇన్నేళ్లపాటు ఎందుకు ఐక్యత సాధించలేకపోయారని అడిగిన జనసేనాని
Pawan Kalyan speech in BC Summit

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరిలో నిర్వహించిన బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రసంగించారు. బీసీల అనైక్యతే మిగతా వారికి బలం అని, బీసీలు ముందుగా సాధించాల్సింది ఐక్యత అని స్పష్టం చేశారు. తాను మానవత్వంతో పెరిగానని, జాతీయ భావాలతో పెరిగానని, కాకపోతే సమాజంలో ఏఏ కులాలు వెనుకబడి ఉన్నాయో వాటిని భుజాలమీదికి ఎత్తుకోవాలని కంకణం కట్టుకున్నానని పవన్ కల్యాణ్ వెల్లడించారు. 

తాను ఏ ఒక్క కులానికో పరిమితం కాదని అన్నారు. తాను కాపు నాయకుడిని మాత్రమే కాదని, ప్రజలందరికీ నాయకుడిగా ఉండాలనుకుంటున్నానని వివరించారు. దేహీ అని అడిగే కొద్దీ రాజ్యాధికారం ఎవరూ ఇవ్వరని, రాజ్యాధికారాన్ని పోరాడి సాధించుకోవాల్సిందేనని పిలుపునిచ్చారు. 

అర్ధరూపాయికి ఓటు అమ్ముకుంటే జీవితకాలం గులాంగిరీ తప్పదని అన్నారు. అన్ని బీసీ కులాలు కలిస్తే రాజ్యాధికారం ఇంకెవరికీ దక్కదని, కానీ ఇన్నాళ్ల పాటు బీసీ కులాలు ఎందుకు ఐక్యత సాధించలేకపోయాయో అర్థం కావడంలేదని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 

ఒక బీసీ సదస్సు అంటే అందరు బీసీ నాయకులు వస్తారు కానీ, ఒక బీసీ నాయకుడ్ని ఎన్నికల్లో నిలబెడితే అతడిని మిగతా బీసీలందరూ ఓటేసి ఎందుకు గెలిపించరు? అని ప్రశ్నించారు. పోరాటం చేసేటప్పుడు బీసీ నేతలంతా ఎలా ఒక్క తాటిపైకి వస్తారో, ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని నిలబెట్టినప్పుడు కూడా అలాగే ఐక్యంగా, బలంగా నిలబడితే మీరు ఇక ఎవరినీ అడగాల్సిన అవసరమే ఉండదు అని అన్నారు. అప్పుడు మిమ్మల్ని (బీసీ నేతలు) చూస్తే నేను కూడా భయపడతాను అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

 "నేను ఎప్పుడైనా మాట్లాడితే నన్ను బీసీ నాయకుల చేత, కాపుల చేత తిట్టిస్తారు. లేకపోతే దళిత నాయకులతో తిట్టిస్తారు. దీని వెనుక ఓ మహత్తరమైన వ్యూహం ఉంది. మీలో మీరు కొట్టుకు చావండి అనేదే వారి ఉద్దేశం. 

పవన్ కల్యాణ్ అనే వ్యక్తి కాపు కాబట్టి బీసీలతో తిట్టిస్తే గ్రామాల స్థాయిలో వాళ్లిద్దరూ కొట్టుకుంటారు... ఇదే వాళ్ల స్ట్రాటజీ. దళితులతో తిట్టిస్తే వాళ్లిద్దరూ కొట్టుకుంటారు. కానీ ఈ పన్నాగం పన్నిన నాయకులు మాత్రం వారు ఏ పార్టీలో ఉన్నా తిట్టుకోరు... ఎంతో మర్యాదగా మాట్లాడుకుంటారు. ఒకవేళ విమర్శించుకున్నా... ఎంతో చక్కగా విమర్శించుకుంటారు. బీసీ కులాల నాయకులంతా ఈ విషయం అర్థం చేసుకోవాలి" అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 

తెలంగాణలో 26 కులాలను బీసీ జాబితా నుంచి తొలగించారని, దీనిపై బీఆర్ఎస్ పార్టీ స్పందించాలని... వైసీపీ, టీడీపీ కూడా స్పందించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. బీసీలకు ఆర్థిక పరిపుష్టి కలిగించాలని, కొందరు ఎదగవద్దు అని హితవు పలికారు. రాజ్యాధికారం ఇస్తే కదా బీసీలు అభివృద్ధి చెందేది అని ఆక్రోశం వ్యక్తం చేశారు.

More Telugu News