Nara Lokesh: అన్నమయ్య జిల్లాలో ఉండేందుకు ఈసీ అనుమతి కోరిన లోకేశ్

Lokesh asks EC exemption to stay in Annamayya district
  • ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు
  • ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిన లోకేశ్ పాదయాత్ర
  • మినహాయింపు ఇవ్వాలన్న లోకేశ్
  • పాదయాత్ర షెడ్యూల్ ముందే నిర్ణయమైందని విజ్ఞప్తి
  • నియోజకవర్గాన్ని వీడాలన్న ఈసీ
  • హైదరాబాద్ పయనమైన లోకేశ్
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నిలిచిపోయింది. మార్చి 13న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుండడంతో, ఎన్నికల కోడ్ కారణంగా పాదయాత్రకు విరామం ప్రకటించారు. అంతేకాదు, మదనపల్లి నియోజకవర్గం కంటేవారిపల్లి బస నుంచి లోకేశ్ తరలి వెళ్లాలని కూడా పోలీసులు సూచించారు. 

దాంతో, తాను అన్నమయ్య జిల్లాలో ఉండేందుకు అనుమతి ఇవ్వాలని లోకేశ్ ఈసీని కోరారు. రాష్ట్రవ్యాప్త పాదయాత్రపై ఇప్పటికే షెడ్యూల్ నిర్ణయించడం జరిగిందని, తమకు మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 

అయితే ఎన్నికల నిబంధన ప్రకారం నియోజకవర్గం వీడాలని ఈసీ జవాబు పంపింది. అందుకు లోకేశ్ స్పందిస్తూ... ఈసీ, చట్టాలను గౌరవిస్తూ జిల్లా వీడుతున్నట్టు వెల్లడించారు. అనంతరం కంటేవారిపల్లి నుంచి హైదరాబాద్ పయనమయ్యారు.

ఎన్నికల కోడ్ కారణంగా ఇవాళ అధికారులు లోకేశ్ కు నోటీసులు ఇచ్చారు. పాదయాత్ర నిలిపివేసి, జిల్లాను వీడాలని స్పష్టం చేశారు. లోకేశ్ బృందంలోని స్థానికేతర సిబ్బంది కూడా వెళ్లిపోవాలని ఆదేశించారు. ఓటర్లు కాని వారు ఉండరాదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే లోకేశ్ పాదయాత్రకు విరామం ప్రకటించారు.
Nara Lokesh
EC
Annamayya District
Election Code
TDP
Andhra Pradesh

More Telugu News