Silicon Valley Bank: సిలికాన్ వ్యాలీ బ్యాంకును కొనాలంటూ సలహా.. ఎలాన్ మస్క్ స్పందన ఇదే!

Elon Musk Shows Interest In Buying Silicon Valley Bank After Collapse
  • తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఎస్‌వీబీ
  • ఈ బ్యాంకును కొనాలంటూ మస్క్ కు ‘రేజర్’ కంపెనీ సీఈవో సూచన
  • ‘నేనూ అదే ఆలోచిస్తున్నా’ అంటూ బదులిచ్చిన ట్విట్టర్ సీఈవో
ఆర్థిక సంక్షోభం కారణంగా అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీ బ్యాంకు (ఎస్‌వీబీ) కుప్పకూలింది. కేవలం 48 గంటల వ్యవధిలోనే బ్యాంకు పీకల్లోతు సంక్షోభంలో మునిగి పోయింది. దీంతో ఎస్‌వీబీని షట్‌డౌన్‌ చేస్తున్నట్లు ఫెడరల్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎఫ్‌డీఐసీ) అధికారింగా ప్రకటించింది. తర్వాత బ్యాంకుకు సంబంధించిన ఆస్తులను సీజ్‌ చేసింది. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత అతిపెద్ద బ్యాంకు వైఫల్యంగా ఇది నమోదైంది.

ఈ నేపథ్యంలో గేమింగ్‌ హార్డ్‌వేర్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ కంపెనీ ‘రేజర్’ సీఈవో మిన్ లియాంగ్ టాన్ .. ట్విట్టర్ సీఈవో ఎలాన్‌ మస్క్‌ కు ఓ ఉచిత సలహా ఇచ్చారు. ‘‘ఎస్ వీబీని ట్విట్టర్ కొనుగోలు చేసి.. డిజిటల్ బ్యాంక్‌గా మార్చాలని నేను భావిస్తున్నా’’ అని ట్వీట్ చేశారు. 

దీనిపై ట్విట్టర్ సీఈవో ఎలాన్‌ మస్క్‌ కూడా స్పందించారు. ఎస్‌వీబీని కొనేందుకు తాను సిద్ధమేనని అర్ధం వచ్చేలా కామెంట్ చేశారు. ‘‘నేనూ అదే ఆలోచిస్తున్నా’’ అంటూ ట్వీట్‌ చేశారు. వీరిద్దరి చర్చ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. అయితే మస్క్ తమాషాకి అన్నారా? లేక సీరియస్ గానే స్పందించారా? అనేది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. నెటిజన్లు మాత్రం అప్పుడే ‘ట్విట్టర్ బ్యాంక్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Silicon Valley Bank
Elon Musk
Min-Liang Tan
Twitter
Buy SVB

More Telugu News