Raid detergent: బై బై మోదీ అంటూ కవితకు మద్దతుగా భాగ్యనగరంలో పెద్ద ఎత్తున పోస్టర్లు

Delhi liquor scam Raid detergent posters appears in Hyderabad for support to kavitha
  • రైడ్ డిటర్జెంట్ పౌడర్ తో ప్రకటన
  • దర్యాప్తు సంస్థల విచారణతో కవితను మార్చలేరనే సందేశం
  • నగరవ్యాప్తంగా పలు చోట్ల ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ శ్రేణులు
ఆ మధ్య ‘సాలు దొర సంపకు దొర’ అంటూ భాగ్యనగరం వ్యాప్తంగా (హైదరాబాద్) బీజేపీ పెద్ద పెద్ద కటౌట్లతో ప్రచారం చేయడం గుర్తుండే ఉంటుంది. అప్పుడే బీజేపీకి దీటుగా టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) సైతం ‘సాలు మోదీ బైబై మోదీ’ అంటూ పోస్టర్లతో కౌంటర్ ఇచ్చింది. ఇప్పుడు మరోసారి అటువంటి వాతావరణమే కనిపిస్తోంది.

ఢిల్లీ లిక్కర్ స్కాములో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు ఇవ్వడం తెలిసిందే. ఈ రోజు ఆమెను ఈడీ విచారిస్తోంది. ఈ క్రమంలో భాగ్యనగరంలో కవితకు మద్దతుగా పోస్టర్లు, హోర్డింగ్ లు దర్శనమిచ్చాయి. జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ శ్రేణులు వీటిని ఏర్పాటు చేశాయి.

ఇందులో రైడ్ డిటర్జెంట్ పౌడర్ ను ప్రకటన రూపంలో తీసుకుని సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు. పలు రాష్ట్రాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణను ఎదుర్కొన్న నేతలు కొందరు, తర్వాత బీజేపీలో చేరిపోవడాన్ని అందులో సందేశంగా చెప్పారు. రైడ్ తో వాష్ చేసినప్పుడు వారి (బీజేపీలో చేరిన వారు) టీ షర్టులు నారింజ రంగులోకి మారిపోయాయి. కానీ, కల్వకుంట్ల కవితను అదే రైడ్ డిటర్జెంట్ పౌడర్ తో వాష్ చేసినట్టు చూపించి, ఏ మాత్రం మార్చలేకపోయినట్టు సందేశం ఇచ్చారు. కాకపోతే ఈ పోస్టర్లు సామాన్యులకు అర్థం కావడం కష్టంగానే ఉంది. ‘అచ్చమైన రంగులు ఎప్పుడూ మాసిపోవు’ అన్న క్యాప్షన్ ఇచ్చారు.
Raid detergent
posters
hoardings
Hyderabad
kalvakuntla kavitha
Delhi liquor scam
ED

More Telugu News