bandi Sanjay: అరెస్ట్ చేయకపోతే ముద్దు పెట్టుకుంటారా? అని ప్రశ్నించిన బండి సంజయ్.. దిష్టిబొమ్మలు దగ్ధం చేసిన బీఆర్ఎస్

  • మహిళల గురించి దీక్ష చేసే హక్కు కవితకు లేదన్న బండి సంజయ్
  • సంజయ్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం
  • మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసే యోచన
BRS leaders burn Bandi Sanjay effigy in Delhi

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవిత ఈడీ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఢిల్లీకి చేరుకున్నారు. మరోవైపు ఈరోజు హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో 'మహిళా గోస-బీజేపీ భరోసా' పేరిట నిరసన దీక్షను నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ కవితపై విమర్శలు గుప్పించారు. చట్ట సభల్లో మహిళా బిల్లుపై దీక్ష చేసే అర్హత, మాట్లాడే నైతిక హక్కు కవితకు లేవని అన్నారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా... నడిరోడ్డుపై హత్యలు జరుగుతున్నా కేసీఆర్ ప్రభుత్వం స్పందించలేదని చెప్పారు. కవిత మొదట తన తండ్రి ఇంటి ముందు ధర్నా చేసి, మహిళలకు జరుగుతున్న అన్యాయంపై ఎందుకు స్పందించడం లేదని కేసీఆర్ ను ప్రశ్నిస్తే బాగుండేదని అన్నారు. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేయకపోతే.. ముద్దు పెట్టుకుంటారా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డాయి. ఢిల్లీ, హైదరాబాద్ లలోని తెలంగాణ భవన్ ల వద్ద బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మరోవైపు బండి సంజయ్ పై మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.

More Telugu News