pulwama martyrs: రాజస్థాన్ లో పుల్వామా అమరుల భార్యల అరెస్ట్.. మండిపడ్డ మహిళా కమిషన్

  • వారం పది రోజులుగా పైలట్ ఇంటిముందు దీక్ష చేస్తున్న మహిళలు
  • వారిని కలిసి మాట్లాడిన రాజస్థాన్ మాజీ ఉపముఖ్యమంత్రి
  • స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో దీక్షను కొనసాగిస్తున్న అమరుల భార్యలు
  • తాజాగా వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు
Rajasthan Police remove Pulwama widows from outside Congress MLA Sachin Pilots house

జమ్మూకశ్మీర్ లోని పుల్వామాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో చనిపోయిన జవాన్ల కుటుంబాలను అన్నివిధాలుగా ఆదుకుంటామని ప్రభుత్వాలు ప్రకటించాయి. అయితే ఈ దుర్ఘటన జరిగి మూడేళ్లు పూర్తయినా ఇప్పటికీ తమకు న్యాయం జరగలేదని రాజస్థాన్ లో అమరుల భార్యలు ఆరోపిస్తున్నారు.

పుల్వామా బాంబు పేలుడులో రాజస్థాన్ కు చెందిన ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. ఆదుకుంటామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు తమను పట్టించుకోవడమే లేదని బాధిత కుటుంబాలు విమర్శిస్తున్నాయి. తమకు న్యాయం కావాలంటూ ఫిబ్రవరి 28 నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ ఇంటి ముందు దీక్షకు దిగారు. వారితో పైలట్ స్వయంగా మాట్లాడారు. వారి డిమాండ్లను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని, వారి కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు.

అయితే, ఈ విషయంలో తమకు స్పష్టమైన హామీ ఇవ్వాలని అమరుల భార్యలు పట్టుబట్టారు. పైలట్ ఇచ్చిన హామీలతో సంతృప్తి చెందక తమ దీక్షను కొనసాగించారు. తాజాగా పోలీసులు వారిని అక్కడి నుంచి బలవంతంగా ఖాళీ చేయించారు. పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్ట్‌ చేసే క్రమంలో ఆ మహిళలతో దురుసుగా ప్రవర్తించిన పోలీసులను సచిన్‌ పైలట్‌ తప్పుబట్టారు. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్‌ కూడా స్పందించింది. పోలీసుల తీరుపై మండిపడింది. వితంతువులపై భౌతిక దాడి జరిగిందని, వివరణ ఇవ్వాలని రాజస్థాన్‌ డీజీపీకి లేఖ రాసింది.

More Telugu News