Sumalatha: బీజేపీలో చేరనున్న సుమలత... సంకేతాలు ఇచ్చిన కర్ణాటక సీఎం

  • మాండ్యా స్థానం నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సుమలత
  • 2019 ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ
  • భర్త అంబరీశ్ మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన సుమలత
  • సంప్రదింపులు జరుగుతున్నాయన్న సీఎం బసవరాజ్ బొమ్మై
Sumalatha reportedly set to join BJP

దక్షిణాదిన పలు భాషల చిత్రాల్లో నటించి, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన సుమలత ప్రస్తుతం మాండ్య లోక్ సభ స్థానం నుంచి పార్లమెంటు సభ్యురాలిగా ఉన్నారు. భర్త అంబరీశ్ మరణంతో ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

అంబరీశ్ కాంగ్రెస్ పార్టీ నేత అయినప్పటికీ, ఎన్నికల్లో సుమలతకు టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సుముఖత చూపలేదు. దాంతో 2019 ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన సుమలత మాండ్యా నియోజకవర్గం నుంచి ఘనవిజయం సాధించారు.

అయితే, ఇప్పుడామె బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. తొలుత ఇది ఊహాగానమే అని భావించినా, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ఈ విషయం గురించి మాట్లాడడంతో మీడియా కథనాలకు బలం చేకూరుతోంది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, దీనికి సంబంధించిన సంప్రదింపులు జరుగుతున్నాయని బొమ్మై వెల్లడించారు. 

రేపు సుమలత మీడియా సమావేశం నిర్వహించడం కూడా దీనిపై ప్రకటన చేసేందుకేనని భావిస్తున్నారు. అంతేకాదు, వచ్చేవారం కర్ణాటక పర్యటనకు రానున్న మోదీ మాండ్యాలో ర్యాలీ నిర్వహించనుండగా, ఈ ర్యాలీలో సుమలత పాల్గొంటారని ప్రచారం జరుగుతోంది. 

సుమలత బీజేపీలో చేరితే మాండ్యా జిల్లాలో కాషాయదళానికి గట్టి పట్టు దొరికినట్టేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

More Telugu News