Asaduddin Owaisi: నాగాలాండ్ లో బీజేపీ కూటమికి ఎన్సీపీ మద్దతు.. పవార్ పై ఒవైసీ తీవ్ర విమర్శలు

  • ‘శరద్’ ఒకవేళ ‘షాదాబ్’ అయ్యుంటే బీజేపీకి ‘బీటీమ్’ అనేవారన్న ఒవైసీ
  • బీజేపీకి ఎన్సీపీ మద్దతు ఇవ్వడం ఇది రెండో సారని వ్యాఖ్య
  • సొంత నేతను జైల్లో పెట్టించిన వారికి సపోర్ట్ చేస్తున్నారని విమర్శ
Asaduddin Owaisis swipe at NCP backing BJP ally in Nagaland

నాగాలాండ్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ డీపీపీ, బీజేపీ కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. 60 సీట్లు ఉన్న అసెంబ్లీలో 37 సీట్లను కూటమి గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఎన్ డీపీపీ నేత, ముఖ్యమంత్రి నీఫ్యూ రియోకు మద్దతు ఇస్తున్నట్లు కాంగ్రెస్ మిత్రపక్షమైన ఎన్సీపీ ప్రకటించింది. దీనిపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను విమర్శిస్తూ ట్వీట్ చేశారు. 

‘శరద్’ ఒకవేళ ‘షాదాబ్’ అయ్యుంటే బీజేపీకి ‘బీటీమ్’ అనేవారని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో లౌకికవాదులకు అంటరాని వాళ్లుగా మారిపోయేవారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను బీజేపీ ప్రభుత్వానికి ఎన్నడూ మద్దతు ఇవ్వలేదు. ఇకపైనా ఇవ్వబోను. బీజేపీకి ఎన్సీపీ మద్దతు ఇవ్వడం ఇది రెండో సారి. ఇదే చివరిది కాకపోవచ్చు కూడా’’ అని ట్వీట్ చేశారు. తన సొంత పార్టీ నేత నవాబ్ మాలిక్ ను జైలులో పెట్టించిన వారికి మద్దతు ఇస్తున్నారని ఒవైసీ విమర్శించారు.

నాగాలాండ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం నీఫ్యూ రియోకు మద్దతు ఇవ్వాలని శరద్ పవార్ నిర్ణయించారని ఎన్సీపీ నార్త్ ఈస్ట్ ఇన్ చార్జ్ వ్యాఖ్యానించారు. సీఎం రియోకు మద్దతు ఇచ్చే పార్టీలతో కలిసి వెళ్లాలని కూడా సూచించారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు చేశారు.

More Telugu News