pune girl: చైన్ స్నాచర్ ను ధైర్యంగా ఎదిరించిన పదేళ్ల బాలిక.. వీడియో ఇదిగో!

10 year old girl attacks chain snatcher to save her grandmother
  • అడ్రస్ అడుగుతూ మెడలో గొలుసు లాక్కెళ్లేందుకు ప్రయత్నించిన యువకుడు
  • నానమ్మతో పాటు దొంగపై దాడి చేసిన బాలిక
  • పూణెలో చోటుచేసుకున్న ఘటన.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
అడ్రస్ అడుగుతూ నానమ్మ మెడలో గొలుసు లాక్కెళ్లేందుకు ప్రయత్నించిన యువకుడిని ఓ పదేళ్ల బాలిక ధైర్యంగా ఎదుర్కొంది.. చేతిలో ఉన్న బ్యాగుతో ఆ దొంగ ముఖంపై పదే పదే కొట్టింది. దీంతో బంగారు గొలుసును కాజేద్దామనుకున్న ఆ దొంగ వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాడు. బుధవారం సాయంత్రం మహారాష్ట్రలోని పూణెలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పూణెలోని శివాజీనగర్ లోని మోడల్ కాలనీలో లతా ఘాగ్ అనే వృద్ధురాలు నివాసం ఉంటున్నారు. బుధవారం సాయంత్రం ఆమె తన ఇద్దరు మనవరాళ్లతో కలిసి దగ్గర్లోని పార్క్ కు వెళ్లారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో తిరిగి ఇంటికి వస్తుండగా.. స్కూటీపై వచ్చిన ఓ యువకుడు లతా ఘాగ్ ను అడ్రస్ అడిగాడు. ఆ చిరునామా గురించి లత చెబుతుండగా ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లేందుకు యువకుడు ప్రయత్నించాడు. ఆ యువకుడు గొలుసును పట్టుకుని లాగుతుండగా లత వదిలించుకునేందుకు పోరాడింది.

ఇంతలో లత పదేళ్ల మనవరాలు రుత్వి ఘాగ్ కూడా నానమ్మకు సాయంగా వచ్చింది. ఇద్దరూ కలిసి చైన్ స్నాచర్ పై దాడి చేశారు. దీంతో గొలుసు వదిలేసి చైన్ స్నాచర్ పలాయనం చిత్తగించాడు. ఈ ఘటన మొత్తం అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. ఆ ఫుటేజీ బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు రుత్వి ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.
pune girl
chain snatching
girl attack
gold chain
old women

More Telugu News