Nara Lokesh: మదనపల్లి నియోజకవర్గంలో ప్రవేశించిన లోకేశ్ పాదయాత్ర.. ఈనాటి హైలైట్స్

  • ఇప్పటి వరకు 497 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న పాదయాత్ర
  • పీలేరు నియోజకవర్గంలో 4 రోజులు కొనసాగిన యాత్ర
  • మహిళా మంత్రులే మహిళలను కించపరుస్తున్నారంటూ లోకేశ్ మండిపాటు
Nara Lokesh Yuvagalam highlights

టీడీపీ యువనేత నారా లోకేశ్ పాదయాత్ర ఈ సాయంత్రం పీలేరు నియోజకవర్గంలో పూర్తి చేసుకుని మదనపల్లి నియోజకవర్గంలో ప్రవేశించింది. నాలుగు రోజుల పాటు ఆయన యువగళం పాదయాత్ర పీలేరు నియోజకవర్గంలో కొనసాగింది. ఈరోజుతో పాదయాత్ర 38వ రోజును పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు నారా లోకేశ్ పాదయాత్ర 497 కిలోమీటర్లను పూర్తి చేసుకుంది. ఈరోజు ఆయన 14 కిలోమీటర్లు నడిచారు. 

ఈ ఉదయం చింతపర్తిలోని బోయపల్లి క్రాస్ వద్ద పాదయాత్ర ప్రారంభమయింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా క్యాంప్ సైట్ లో మహిళలకు పాదాభివందనం చేసిన యువనేత... వారితో సమావేశమై ఇబ్బందులను తెలుసుకున్నారు. అనంతరం మహిళలు పెద్దఎత్తున యువనేతకు సంఘీభావంగా పాదయాత్రలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... ఏనాడూ రాజకీయాల్లో లేని తన తల్లిని అసెంబ్లీ సాక్షిగా వైసీపీ నేతలు అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాల ద్వారా మాత్రమే మహిళలకు రక్షణ రాదని... చిన్న వయస్సు నుండే మగ వాళ్లకు మహిళల గౌరవం తెలిసేలా ప్రత్యేక పాఠ్యాంశాలు ఉండాలని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే కేజీ నుండి పీజీ వరకూ మహిళల గొప్పతనం, వారు పడే కష్టాలు తెలిసేలా ప్రత్యేక పాఠ్యాంశాలు పెడతామని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో మాదిరిగా మహిళల భద్రతకు పటిష్ఠమైన విధానాలు అమలుచేసేలా అధ్యయనం చేస్తామని హామీ ఇచ్చారు. మహిళా మంత్రులే మహిళల్ని కించపరిచేలా మాట్లాడుతున్నారని... మహిళా మంత్రి రోజా తనకు చీర, గాజులు పంపుతానని అన్నారని మండిపడ్డారు. మహిళలు అంటే ఈ ప్రభుత్వానికి ఎందుకు అంత చిన్న చూపు. జగన్ పాలన లో మహిళలకు రక్షణ లేదని విమర్శించారు. జగన్ సొంత నియోజకవర్గం లో నాగమ్మ అనే మహిళపై అత్యాచారం జరిగితే పోరాడిన దళిత మహిళా నాయకురాలు అనిత పై ఎస్సీ,ఎస్టీ కేసు పెట్టారని దుయ్యబట్టారు. 

ఆ తర్వాత పాదయాత్ర జమనపల్లి వద్దకు చేరుకోగానే బాణాసంచా మోతలతో దద్దరిల్లింది. చింతలవారిపల్లిలో మహిళలు యువనేతకు ఎదురేగి హారతులిచ్చి స్వాగతం పలికారు. విటలం గ్రామంలో యువనేతపై పూలవర్షం కురిపించి బాజాభజంత్రీలతో తమ గ్రామంలోకి ఆహ్వానించారు. మధ్యాహ్నం పునుగుపల్లిలో భోజన విరామానంతరం పాదయాత్ర వాయల్పాడు చేరుకున్న సమయంలో అక్కడి ప్రజలు యువనేతకు నీరాజనాలు పలికారు. వాయల్పాడు పట్టణంలో దారిపొడవునా యువతీయువకులు, మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు రోడ్లవెంట బారులు తీరారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ జగన్ పై విమర్శలు గుప్పించారు. 

"వాలంటీర్లు వచ్చి టీడీపీ వస్తే సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తారు అని దుష్ప్రచారం చేస్తున్నారు. హామీ ఇవ్వని సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేసింది చంద్రబాబు. అన్న క్యాంటీన్, విదేశీ విద్య, పండుగ కానుకలు, చంద్రన్న బీమా, పెళ్లి కానుకలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు. రూ.200 పెన్షన్ రూ. 1800 పెంచి రూ.2000 చేసింది చంద్రబాబు. జగన్ వచ్చిన తరువాత గత ప్రభుత్వంలో అమలుచేసిన 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. పండుగ కానుకలు, పెళ్లి కానుకలు, విదేశీ విద్య, అన్న క్యాంటీన్, 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసింది జగన్. రూ.250 చొప్పున రూ.750 పెన్షన్ పెంచడానికి జగన్ కి నాలుగేళ్లు పట్టింది. కరెంట్ ఛార్జీలు 7 సార్లు పెంచాడు, 8 వ సారి పెంచబోతున్నాడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచాడు. పెట్రోల్, డీజిల్ ధరల్లో జగన్ దేశంలోనే నంబర్ 1. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశానికి అంటాయి. సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన చరిత్ర జగన్ కి మాత్రమే ఉంది.
 
మహిళల్ని మోసం చేసింది జగన్. దిశ చట్టం లేకుండానే జగన్ హడావిడి చేశారు. 900 మంది మహిళలపై అత్యాచారాలు జరిగితే 21 రోజుల్లో ఒక్కరికీ న్యాయం జరగలేదు. సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతా అన్న జగన్... మోసం చేసి ఇప్పుడు ఏకంగా జే బ్రాండ్ లిక్కర్ తయారు చేసి అమ్ముతున్నారు. తాగుబోతుల్ని తాకట్టు పెట్టి 25 వేల కోట్లు అప్పు తెచ్చాడు జగన్. అమ్మ ఒడి ఎంత మంది పిల్లలు ఉన్నా ఇస్తా అన్న జగన్ మోసం చేశారు. 45 ఏళ్లకు బీసీ, ఎస్టీ, ఎస్సీ మహిళలకు పెన్షన్ ఇస్తా అని మోసం చేశాడు జగన్. వైసీపీ కేసులకు బయపడొద్దు. అక్రమ కేసులు పెట్టిన అధికారులపై టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జ్యూడీషియల్ ఎంక్వైరీ వేస్తాం. చర్యలు తీసుకుంటాం.
 
ఎక్కువ మంది మహిళలు చదువు కోవడానికి, డ్రాప్ అవుట్స్ లేకుండా చెయ్యడానికి టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తాం. ప్రత్యేక కళాశాలలు, ఉన్నత విద్యకు సహాయం, విదేశీ విద్యకు సహాయం అందిస్తాం. సమాన వేతనం కోసం అనేక చర్యలు గతంలో తీసుకున్నాం. అనేక పరిశ్రమలు తీసుకొచ్చినప్పుడు మహిళలకు ప్రత్యేకంగా ఉద్యోగాలు కల్పించడంతో పాటు మంచి జీతాలు ఇవ్వాలని మేము కంపెనీలను కోరేవాళ్ళం. ఎన్నికల ముందు కులం, మతం చూడము అన్నారు. ఇప్పుడు ఉపాధి హామీలో ఫీల్డ్ అసిస్టెంట్ల దగ్గర నుండి సంఘమిత్రల వరకూ అడ్డగోలుగా తొలగిస్తున్నారు. ఆఖరికి డ్వాక్రా మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు కూడా జగన్ ప్రభుత్వం కొట్టేసింది. వన్ టైం సెటిల్మెంట్ ఒక పెద్ద మోసం. 10 వేలు కట్టించుకొని ఇచ్చిన ధ్రువ పత్రం తీసుకొని రుణం కోసం బ్యాంక్ కు వెళ్తే బయటకి పొమ్మని తిడుతున్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే కర్ణాటక మోడల్ డీకేటీ విధానాన్ని తెచ్చి భూములు, స్థలాలపై హక్కులు కల్పించే అంశాన్ని పరిశీలిస్తాం" అని లోకేశ్ అన్నారు.

More Telugu News