ఈ నెలాఖరులోగా ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తాం: సజ్జల

  • డిమాండ్ల సాధన కోసం నిరసన బాట పట్టిన ఉద్యోగులు
  • ఈ నెల 9 నుంచి కార్యాచరణ
  • నేడు ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ సమావేశం
  • ముగిసిన చర్చలు
Sajjala says govt will clear pending payments of employees

ఏపీ ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. కరోనా వల్ల రాష్ట్ర ఆదాయం తీవ్రంగా దెబ్బతిన్నదని వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగుల సమస్యలపై తామే రెండు మెట్లు దిగి చర్చిస్తున్నట్టు తెలిపారు. 

ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. రూ.3 వేల కోట్ల మేర బకాయిలను ఈ నెలాఖరులోగా చెల్లిస్తామని సజ్జల పేర్కొన్నారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమేనని, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ ముందుంటామని పేర్కొన్నారు. చిన్న చిన్న సమస్యలను కలిసి పరిష్కరించుకుంటామని సజ్జల స్పష్టం చేశారు. 

నేడు జరిగిన చర్చల్లో కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయని వెల్లడించారు. మరికొన్ని అంశాలను త్వరలోనే పరిష్కరించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. 

మంత్రి ఆదిమూలపు సురేశ్ మాట్లాడుతూ, ఉద్యోగుల పెండింగ్ క్లెయింలను ఈ నెల 31 లోగా క్లియర్ చేస్తామని చెప్పారు. జీపీఎఫ్ బకాయిలు, రిటైర్మెంట్ గ్రాట్యుటీ, మెడికల్ అరియర్స్ అన్నీ చెల్లిస్తామని పేర్కొన్నారు.

More Telugu News