Nara Lokesh: ​​విశాఖలో జరిగింది ఫేక్ సమ్మిట్... అసలు వాస్తవాలు రేపు ప్రెస్ మీట్ లో చెబుతా: లోకేశ్​

  • కొనసాగుతున్న నారా లోకేశ్ యువగళం పాదయాత్ర
  • నేడు పీలేరు నియోజకవర్గంలో ప్రవేశించిన పాదయాత్ర
  • పీలేరులో లోకేశ్ కు ఘనస్వాగతం
  • విశాఖలో పెట్టుబడిదారులు గిఫ్టుల కోసం కొట్టుకున్నారని ఎద్దేవా
Lokesh says Visakha summit was fake

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో భాగంగా నేడు పీలేరు నియోజకవర్గంలో అడుగుపెట్టారు. పీలేరులో లోకేశ్ కు అపూర్వ స్వాగతం లభించింది. ఈ ఉదయం పుంగనూరు నియోజకవర్గం జ్యోతినగర్ విడిది కేంద్రం నుంచి ప్రారంభమైన పాదయాత్ర అగ్రహారం క్రాస్ వద్ద పీలేరు నియోజకవర్గంలో ప్రవేశించింది. అంతకుముందు, లోకేశ్ ఆకస్మికంగా కన్నుమూసిన ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి వరుపుల రాజా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యువగళం పాదయాత్రలో టీడీపీ నేతలు కన్నా లక్ష్మీ నారాయణ, ధూళిపాళ్ల నరేంద్ర పాల్గొని సంఘీభావం తెలిపారు. 

అది గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కాదు... లోకల్ ఫేక్ సమ్మిట్!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖలో పెట్టింది గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కాదని... లోకల్ ఫేక్ సమ్మిట్ అని లోకేశ్ విమర్శించారు. యువగళం పాదయాత్రలో భాగంగా పీలేరులో నిర్వహించిన బహిరంగసభకు జనం పోటెత్తారు. 

సభలో లోకేశ్ మాట్లాడుతూ... పెట్టుబడులు పెట్టడానికి వచ్చినవాళ్లు గిఫ్టులకోసం కొట్టుకున్నారని ఎద్దేవా చేశారు. "కాగితాల్లేకుండా ఫేక్ ఎంవోయూలు చేసుకున్నారు. సోమాలియాలో కూడా భోజనం, గిఫ్టుల కోసం అలా కొట్టుకోరు. దీనిని ఇన్వెస్టర్స్ సమ్మిట్ అంటారా? ఇండోసోల్ అనే కడపకు చెందిన జగన్ బినామీ కంపెనీ రూ.76 వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్లు కలరింగ్ ఇచ్చారు. ఆ కంపెనీ పేరుతో 25 వేల ఎకరాల భూములు కొట్టేయడానికి ప్లాన్ చేశారు. కానీ నెట్ లో కొట్టి చూస్తే ఆ కంపెనీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కేవలం లక్ష రూపాయలు మాత్రమేనని బయటపడింది. 

సిరాంటికా అనే ఐటీ కంపెనీలో 50 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఆ కంపెనీ రూ.8 వేల కోట్ల పెట్టుబడులు పెడుతుందట. ఏబీసీ మరో ఊరు పేరు లేని కంపెనీ రూ.1.50 లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతుందట. ఫేక్ సమ్మిట్ పై రేపు నేను ప్రెస్ మీట్ పెట్టబోతున్నా. అసలు వాస్తవాలు బయట పెడతా. 

చంద్రబాబు పాలనలో తెచ్చిన లులూ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఫాక్స్ కాన్, అమర్ రాజా వంటి పెద్దపెద్ద కంపెనీలను జే ట్యాక్స్ కోసం తరిమేసి... ఫేక్ కంపెనీలతో పెట్టుబడులు పెడుతున్నామంటూ అబద్దాలు చెప్పిస్తున్నారు. విజనరీ, ప్రిజనరీకి చాలా తేడా ఉంది. టీడీపీ పాలనలో పెట్టుబడులు వెల్లువెత్తాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన 4ఏళ్ల వరకు ఒక్క రూపాయి కూడా పెట్టుబడులు రాలేదు" అని లోకేశ్ వెల్లడించారు.

ఒక్కచాన్స్ పేరుతో సర్వనాశనం!

ఒక్క ఛాన్స్... ఒక్క ఛాన్స్... అని ముఖ్యమంత్రి అయిన జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని లోకేశ్ విమర్శించారు. "ఒక్క ఛాన్స్ వల్ల మన జీవితాల్లో ఎలాంటి మార్పులు రాలేదు... పిచ్చోడి చేతిలో రాయిపెట్టినట్లు తయారైంది మన రాష్ట్రం పరిస్థితి. యువగళం పాదయాత్ర ప్రారంభించిన నాటినుండి జగన్ కు నిద్ర పట్టడం లేదు. నా పాదయాత్రను ఎలా అడ్డుకోవాలి అంటూ స్కెచ్ వేస్తున్నారు. వెయ్యి మంది పోలీసులు, ఆరుగురు డీఎస్పీలు, 20 మంది సీఐలు, ఇంటెలిజెన్స్ అధికారులు... ఒక్క లోకేష్ ను ఆపడానికి ఇంత మంది అవసరమా? 400 రోజులు మీ మధ్యే ఉంటా... ఎవరాపుతారో చూస్తా. నేను చేసేది ప్రజా పాదయాత్ర...జగన్ రెడ్డి చేసేది పరదాల యాత్ర" అని వ్యాఖ్యానించారు.

జగన్ పాలనలో బాగుపడింది ఆ నలుగురు రెడ్లే!

ప్రస్తుత పరిస్థితులపై పీలేరులోని రెడ్డి సోదరులు కూడా ఆలోచించాలని నారా లోకేశ్ పిలుపునిచ్చారు. జగన్ రెడ్డి పాలనలో లబ్ధిపొందింది కేవలం నలుగురు రెడ్లు మాత్రమేనని అన్నారు. పాపాల పెద్దిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి తప్ప రాష్ట్రంలో ఏ రెడ్డి సోదరులూ బాగుపడలేదని వ్యాఖ్యానించారు. 

"జగన్ అనే వ్యక్తి సీఎం అయ్యాక దళితులను చంపేందుకు వైసీపీ నాయకులకు లైసెన్స్ ఇచ్చాడు. ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ దళితుడు సుబ్రహ్మణ్యంను చంపి, డోర్ డెలివరీ చేశాడు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు దోచేశాడు. అసైన్డ్ భూములను లాక్కున్నారు. దళిత డాక్టర్ సుధాకర్ ను వేధించి చంపేశారు. మరో డాక్టర్ అనితను వేధించారు" అని వివరించారు.

పీలేరును అడ్డంగా దోచుకుంటున్న ఆ ముగ్గురు!

చింతల రామచంద్రారెడ్డిని ఇక్కడ రెండుసార్లు గెలిపించారని, మీకు చింతలు తప్ప ఏమీ మిగల్లేదని పీలేరు ప్రజలను ఉద్దేశించి లోకేశ్ ప్రసంగించారు. పాపాల పెద్దిరెడ్డి, మిధున్ రెడ్డి, ఎమ్మెల్యే బావమరిది హరీష్ రెడ్డి పీలేరును అడ్డంగా దోచుకుంటున్నారని ఆరోపించారు. 

"ఈ నియోజకవర్గంలో రూ.500కోట్ల విలువైన 200 ఎకరాల భూమిని ఆక్రమించేందుకు పాపాల పెద్దిరెడ్డి ప్రయత్నిస్తే మన టీడీపీ సింహం నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి పోరాడి అడ్డుకున్నారు. దీన్ని తట్టుకోలేక సబ్ కలెక్టర్ ను పాపాల పెద్దిరెడ్డి ట్రాన్స్ ఫర్ చేయించాడు. పెద్దిరెడ్డి కన్ను పడిన ఏ భూమి అయినా అది స్వాహా అయినట్టే. రాత్రికి రాత్రే పేదల భూముల్లో ఫెన్సింగ్ వేసి, ఆ మరుసటి రోజు దొంగ పత్రాలు సృష్టించి లాక్కుంటున్నాడు పెద్దిరెడ్డి" అని ఆరోపించారు.


పాదయాత్ర వివరాలు:*

*ఇప్పటి వరకు నడిచిన దూరం కి.మీ. 458.5 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం – 10.4 కి.మీ.*

*యువగళం పాదయాత్ర 36వ రోజు షెడ్యూల్(6-3-2023)*

*పీలేరు నియోజకవర్గం*

ఉదయం

9.00 – పీలేరు శివారు వేపులబయలులో బీసీ సామాజికవర్గీయులతో ముఖాముఖి. విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం.

10.00 – వేపులబయలు నుంచి పాదయాత్ర ప్రారంభం.

11.00 – అంకాళమ్మతల్లి దేవాలయం వద్ద ఉప్పర, సగర సామాజికవర్గీయులతో మాటామంతీ.

మధ్యాహ్నం

12.30 – శివాపురం గ్రామంలో స్థానికులతో భేటీ.

1.05 – తిమ్మిరెడ్డిగారిపల్లిలో భోజన విరామం

సాయంత్రం

3.05 – తిమ్మిరెడ్డిగారిపల్లి నుంచి పాదయాత్ర కొనసాగింపు.

4.20 – కొర్లకుంట పట్టికాడ గ్రామంలో స్థానికులతో మాటామంతీ.

4.50 – కలికిరి పంచాయితీ సత్యపురం వద్ద స్థానికులతో భేటీ.

5.15 – కలికిరిలో రైతులతో భేటీ.

5.30 – కలికిరి పంచాయితీ నగిరిపల్లి క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ.

6.20 – కలికిరి ఇందిరమ్మ కాలనీ వద్ద పార్టీలో చేరికలు.

6.30 – కలికిరి ఇందిరమ్మ కాలనీ వద్ద విడిది కేంద్రంలో బస.


More Telugu News