Credit Card: క్రికెటర్లు, నటుల పేరుతో క్రెడిట్ కార్డు తీసుకుని రూ.50 లక్షలకు టోకరా

  • ఢిల్లీలో ఘరానా మోసం
  • తప్పుడు వివరాలతో క్రెడిట్ కార్డులు
  • సెలబ్రిటీల పాన్ కార్డు, ఆధార్ వివరాలు ఉపయోగించుకున్న వైనం
  • నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Credit Card cheating in Delhi

దేశంలో భారీస్థాయిలో క్రెడిట్ కార్డు మోసం వెల్లడైంది. టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ స్టార్లు అభిషేక్ బచ్చన్, సోనమ్ కపూర్, అలియా భట్, సైఫ్ అలీ ఖాన్, శిల్పాశెట్టి తదితరుల పేరు మీద అక్రమ మార్గాల్లో క్రెడిట్ కార్డులు పొందిన ఘరానా మోసగాళ్లు రూ.50 లక్షల మేర టోకరా వేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఇది వెలుగుచూసింది. 

ప్రముఖుల పుట్టినరోజు తేదీలు, జీఎస్టీఎన్ వివరాలను గూగుల్ ద్వారా సంపాదించిన కేటుగాళ్లు... వాటి సాయంతో వన్ కార్డ్ ఫిన్ టెక్ కంపెనీ నుంచి క్రెడిట్ కార్డులు పొందారు. తప్పుడు మార్గాల్లో సెలబ్రిటీల పాన్ కార్డు, ఆధార్ కార్డు వివరాలు పొందారు. వివరాలు ప్రముఖులవి, ఫొటోలు మాత్రం తమవి ఉండేలా మోసగాళ్లు జాగ్రత్తపడ్డారు. ఆ విధంగా వన్ కార్డ్ నుంచి క్రెడిట్ కార్డులు పొందారు. 

సదరు క్రెడిట్ కార్డ్ సంస్థ వీడియో వెరిఫికేషన్ నిర్వహించిన సమయంలోనూ ఈ మోసగాళ్లు ఆ సంస్థ సిబ్బందిని ఏమార్చారు. వారు పొందుపరిచిన వివరాలన్నీ నిజమేనని నమ్మిన ఆ సంస్థ రూ.10 లక్షల క్రెడిట్ లిమిట్ తో క్రెడిట్ కార్డులు జారీ చేసింది. దాంతో పండగచేసుకున్న కేటుగాళ్లు వారం రోజుల్లోనే ఆ మొత్తాన్ని హాంఫట్ చేశారు. ఒకే ఫోన్ నుంచి ఎక్కువ సంఖ్యలో అప్లికేషన్లు రావడంతో వన్ కార్డ్ సంస్థ అప్రమత్తం కావడంతో, ఈ మోసం వెలుగులోకి వచ్చింది. 

వెంటనే ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయగా, సునీల్ కుమార్, పంకజ్ మిశార్, పునీత్, విశ్వభాస్కర శర్మ, మహ్మద్ ఆసిఫ్ అనే వ్యక్తులను అరెస్ట్ చేశారు. కాగా, ఈ మోసగాళ్లు క్రెడిట్ కార్డులు ఎలా జారీ చేస్తారు? ఆన్ లైన్ వెరిఫికేషన్ ప్రక్రియలో లొసుగుల గురించి కొన్ని నెలల పాటు పరిశోధన చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.

More Telugu News