Sri chaitanya: క్లాస్ రూంలోనే ఉరేసుకున్న ఇంటర్ విద్యార్థి

  • నార్సింగి శ్రీచైతన్య కాలేజీలో ఘటన
  • యాజమాన్యం ఒత్తిడి వల్లేనని తోటి విద్యార్థుల ఆరోపణ
  • విచారణకు ఆదేశించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
  • విద్యార్థి కుటుంబాన్ని ఆదుకుంటామన్న కాలేజీ యాజమాన్యం
Inter student died by suicide in hyderabad srichaitanya college

తెలంగాణలో మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. క్లాస్ రూంలో రాత్రి పూట ఫ్యాన్ కు ఉరేసుకున్నాడు. హైదరాబాద్ లోని నార్సింగి శ్రీ చైతన్య కాలేజ్ లో మంగళవారం రాత్రి ఈ దారుణం జరిగింది. యాజమాన్యం ఒత్తిడి వల్లే విద్యార్థి చనిపోయాడని క్లాస్ మేట్స్ ఆరోపించారు. ఉరేసుకున్న విషయం తెలిసిన తర్వాత కూడా యాజమాన్యం నిర్లక్ష్యం వీడలేదని మండిపడ్డారు. ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సాత్విక్ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని ఇంటర్ బోర్డు సెక్రటరీ నవీన్ మిట్టల్ ను ఆదేశించారు. కాగా, స్టూడెంట్ చనిపోయిన విషయం తెలిసి అక్కడికి చేరుకున్న పోలీసులు.. పోస్ట్ మార్టం కోసం సాత్విక్ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న ఎన్.సాత్విక్ మంగళవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. క్లాస్ రూంలో రాత్రి 10:30 ప్రాంతంలో సాత్విక్ ఉరేసుకున్నాడని, విషయం తెలిసిన తర్వాత ఆసుపత్రికి తరలించడానికి యాజమాన్యం తాత్సారం చేసిందని తోటి విద్యార్థులు చెప్పారు. దీంతో తామే లిఫ్ట్ అడిగి సాత్విక్ ను ఆసుపత్రికి తీసుకెళ్లామని వివరించారు. అక్కడికి చేరేసరికే సాత్విక్‌ చనిపోయాడన్నారు. సాత్విక్ తల్లిదండ్రులతో కలిసి కాలేజీ ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో హాస్టల్ ఖాళీ చేసి విద్యార్థులను ఇళ్లకు పంపించేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తోందని సమాచారం.

ఈ ఘటనకు సంబంధించి శ్రీ చైతన్య కాలేజ్ యాజమాన్యంపై ఐపీసీ 305 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు, ఈ ఘటనపై శ్రీచైతన్య కాలేజీ యాజమాన్యం కూడా స్పందించింది. మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటామని తెలిపింది. విద్యార్థి మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటనలో తెలిపింది.

More Telugu News