Delhi: ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు మంత్రులుగా ప్రమోషన్ ఇస్తున్న కేజ్రీవాల్

MLAs Saurabh Bhardwaj Atishi to be elevated as ministers CM Kejriwal sends names to LG
  • మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన మనీశ్ సిసోడియా
  • మనీలాండరింగ్ ఆరోపణలపై జైలు పాలైన సత్యేంద్ర జైన్
  • తమ మంత్రి పదవులకు రాజీనామా చేసిన సిసోడియా, సత్యేంద్ర 
  • క్యాబినెట్ లోకి కొత్తగా సౌరభ్ భరద్వాజ్, అతిషి 
ఢిల్లీ క్యాబినెట్ లో రెండు మార్పులు జరగనున్నాయి. మద్యం కుంభకోణం ఆరోపణలపై సీబీఐ అరెస్ట్ చేసిన ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాతో పాటు సత్యేంద్ర జైన్ తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. వీరి స్థానాల్లో ఎమ్మెల్యేలు సౌరభ్ భరద్వాజ్, అతిషిని క్యాబినెట్ లోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయించారు. ఈ ఇద్దరి పేర్లను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు పంపించారు. ఎల్జీ ఆమోదం తర్వాత కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనుంది. రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. 

కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. మరోవైపు మనీలాండరింగ్ కేసులో ప్రమేయం వుందంటూ గతేడాది మేలో సత్యేందర్ జైన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. ఈ ఇద్దరి దగ్గర 20 పోర్ట్‌ ఫోలియోలు ఉన్నాయి. సిసోడియా ఢిల్లీ ఉపముఖ్యమంత్రిగా విద్యతో పాటు అనేక ఉన్నత స్థాయి శాఖలను చూస్తున్నారు. జైన్ ఢిల్లీ ఆరోగ్య, జైళ్ల శాఖ మంత్రిగా ఉన్నారు. సిసోడియా దగ్గర ఉన్న విద్య, ఆర్థిక శాఖ సహా కొన్న పోర్ట్‌ఫోలియోలు కైలాష్ గహ్లోట్, రాజ్ కుమార్ ఆనంద్‌లకు కేటాయించనున్నారు. వచ్చే వారం మొదలయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగాలని సీఎం కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
Delhi
AAP
Arvind Kejriwal
new ministers

More Telugu News