Nikki Haley: నేను అధికారంలోకి వస్తే అమెరికాను ద్వేషించే దేశాలకు ఒక్క పైసా కూడా ఇవ్వను: నిక్కీ హేలీ

  • అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో నిక్కీ హేలీ
  • రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలో భారత సంతతి మహిళా నేత
  • పాకిస్థాన్ తదితర దేశాలకు అమెరికా నిధులు ఇవ్వడంపై వ్యతిరేకత
  • అమెరికన్లు కష్టపడి సంపాదించిన సొమ్మును ఇలా వృధా చేయనని వెల్లడి
Nikky Haley comments on US foreign aid policy

అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో తాను పోటీ చేస్తున్నట్టు భారత సంతతి రిపబిక్లన్ నేత నిక్కీ హేలీ ప్రకటించారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉన్న నిక్కీ హేలీ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

తాను అధికారంలోకి వస్తే అమెరికాను వ్యతిరేకించే దేశాలకు ఒక్క పైసా కూడా ఇవ్వనని స్పష్టం చేశారు. అమెరికా ఓ దేశంగా బలంగా ఉన్నప్పుడు ఇలాంటి దుష్టదేశాలకు నిధులు ఇవ్వడం ఎందుకని ఆమె ప్రశ్నించారు. అమెరికన్లు ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్మును ఈ విధంగా వృధా చేయబోనని హేలీ స్పష్టం చేశారు. 

నిక్కీ హేలీ పేర్కొన్న చెడ్డ దేశాల జాబితాలో చైనా, పాకిస్థాన్ తదితర దేశాలు ఉన్నట్టు తెలుస్తోంది. "మా శత్రుదేశాలను వ్యతిరేకించే దేశాలనే మేం విశ్వసిస్తాం. వారే అమెరికాకు మిత్రులు" అని తన వైఖరిని వెల్లడించారు. 

అమెరికా గతేడాది పలు దేశాలకు నిధుల రూపంలో 46 బిలియన్ డాలర్లు అందించిందని హేలీ పేర్కొన్నారు. ఇదంతా అమెరికా ప్రజలు చెల్లించిన పన్నుల మొత్తమేనని, మరి ఈ డబ్బంతా ఎటువెళుతోందని అడిగే హక్కు పన్నులు కట్టేవారికి ఉంటుందని అన్నారు. తాము పన్నుల రూపంలో చెల్లించిన డబ్బును అమెరికాను ద్వేషించే దేశాలకు అందజేస్తున్నారని తెలిస్తే అమెరికా ప్రజలు దిగ్భ్రాంతికి గురవుతారని ఆమె వ్యాఖ్యానించారు.

More Telugu News