Yanamala: పార్లమెంట్ లో చేసిన చట్టమే ఫైనల్: యనమల

  • మూడు రాజధానుల విషయంలో యనమల కామెంట్
  • రాష్ట్ర ప్రభుత్వాల చట్టాలు పార్లమెంట్ చట్టాలకు అనుగుణంగా ఉండాల్సిందే
  • ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా రాజధానిపై తప్పుడు ప్రచారం
  • రాష్ట్ర పోలీసులు జగన్ పీనల్ కోడ్ ప్రకారం నడుచుకుంటున్నారని ఫైర్
  • లోకేశ్ పాదయాత్రను అడ్డుకోవడంపై మండిపడ్డ టీడీపీ సీనియర్ నేత
yanamala ramakrishnudu press meet

రాజధాని విషయంలో వైసీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు గందరగోళం సృష్టిస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. శనివారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో పార్లమెంట్ లో చేసిన చట్టమే ఫైనల్ అని, రేపు కోర్టులు కూడా ఇదే చెబుతాయని ఆయన అన్నారు. 2014 లో పార్లమెంట్ చేసిన ఏపీ రీఆర్గనైజేషన్ చట్టంలో ఆంధ్రప్రదేశ్ కు రాజధాని విషయంలో స్పష్టత ఉందన్నారు. ఆ చట్టం ప్రకారమే అమరావతిని గత ప్రభుత్వం రాజధానిగా ప్రకటించిందని చెప్పారు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజలను గందరగోళంలోకి నెట్టే ప్రయత్నాలు చాలా జరిగాయని యనమల ఆరోపించారు. మూడు రాజధానుల విషయంపై తాము కోర్టుకు వెళితే ప్రభుత్వం వెనక్కి తగ్గిందని, తన ప్రతిపాదనను వెనక్కి తీసుకుందని చెప్పారు. అయితే, కొంతమంది వైసీపీ నేతలు మాత్రం మూడు రాజధానుల ప్రతిపాదనను ప్రభుత్వం వాపస్ తీసుకోలేదని ప్రచారం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు చేసే చట్టాలు తప్పనిసరిగా పార్లమెంట్ చట్టాలకు అనుగుణంగా, వాటికి లోబడే ఉండాలని చెప్పారు.

ఈ మాత్రం ఇంగితజ్ఞానం జగన్ కు లేదా లేదంటే మూడు రాజధానుల విషయంలో ఆయనకు లీగల్ సలహా ఇచ్చిన వారికి లేదా అని యనమల ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రకారమే ప్రభుత్వాల పాలన కొనసాగాలి తప్ప ప్రభుత్వంలోని పెద్దల ఇష్టానుసారం జరగడానికి వీల్లేదని యనమల తేల్చిచెప్పారు. రాష్ట్రంలోని ప్రతిపక్షాలను, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఇరుకున పెట్టేవారిని అణిచివేసేందుకు వైసీపీ ప్రభుత్వం జేపీసీని అమలు చేస్తోందని మండిపడ్డారు.

జేపీసీ అంటే.. జగన్ పీనల్ కోడ్ అని యనమల చెప్పారు. రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఎక్కడైనా, ఎవరికైనా పాదయాత్ర చేసుకునే హక్కు ఉందని చెప్పారు. సాధారణంగా ఏ ప్రభుత్వమూ ఈ యాత్రలను అడ్డుకోదని, వైసీపీ ప్రభుత్వం మాత్రం లోకేశ్ పాదయాత్రను అడ్డుకుంటోందని విమర్శించారు. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) ని ఫాలో కావాల్సిన పోలీసులు జగన్ పీనల్ కోడ్ (జేపీసీ) ప్రకారం నడుచుకుంటూ లోకేశ్ పాదయాత్రకు అడ్డుచెబుతున్నారని యనమల ఫైర్ అయ్యారు.

నారా లోకేశ్ యాత్రను అడ్డుకునేందుకు ఒకడు మైక్ లాగేసుకుంటే మరొకడు స్టూల్ లాగేసుకుంటున్నాడని చెప్పారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల లోకి పాదయాత్ర కూడా వస్తుందన్నారు. దీనికి అడ్డుచెప్పే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు చేష్టలుడిగి చూస్తున్నారని ఆరోపించారు. శాంతియుతంగా జరిగే పాదయాత్రను పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారో తనకు అర్థం కావడంలేదని యనమల చెప్పారు.

More Telugu News