PV Sindhu: పీవీ సింధు-పార్క్ బంధానికి బీటలు.. కొత్త కోచ్‌ను వెతుక్కుంటున్న సింధు

  • 2019 నుంచి కలిసి పనిచేస్తున్న సింధు-పార్క్
  • పార్క్ హయాంలో పలు విజయాలు సొంతం చేసుకున్న సింధు
  • ఇటీవలి కాలంలో నిరాశాజనకంగా సింధు ప్రదర్శన
  • కొత్త కోచ్‌ను వెతుక్కునే పనిలో సింధు
PV Sindhu parts ways with coach Park Tae Sang

భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కొత్త కోచ్‌ను వెతుక్కునే పనిలో  పడింది. ఇప్పటి వరకు తనకు కోచ్‌గా వ్యవహరిస్తున్న దక్షిణ కొరియాకు చెందిన పార్క్ తే సంగ్ సేవలకు గుడ్‌బై చెప్పేసింది. ఈ విషయాన్ని పార్క్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడిస్తూ భారమైన పోస్టు పెట్టాడు. పార్క్-సింధు కలిసి 2019 నుంచి కలిసి పనిచేస్తున్నారు.

పార్క్ కోచింగ్‌లో సింధు పలు విజయాలు సాధించింది. మూడు బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిళ్లు, సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ టైటిల్, స్విస్ ఓపెన్, సింగపూర్ ఓపెన్‌లను గెలుచుకుంది. అలాగే, 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించింది.

కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన తర్వాత ఎడమకాలి గాయం కారణంగా సింధు దాదాపు ఐదు నెలల విరామం తీసుకుంది. ఆ తర్వాత మలేసియా, ఇండోనేషియా ఓపెన్‌తోపాటు పలు టోర్నీలు ఆడిన సింధు తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టింది. దుబాయ్‌లో జరిగిన ఆసియా మిక్స్‌డ్‌ చాంపియన్‌షిప్‌లో తనకంటే చాలా తక్కువ ర్యాంక్‌ ప్లేయర్ల చేతిలోనూ ఓడింది. దీంతో సింధు-పార్క్ బంధం బీటలు వారింది. ఇటీవలి ఆమె పరాజయాలకు పూర్తి బాధ్యత తనదేంటూ పార్క్ ఆ పోస్టులో పేర్కొన్నాడు.   

సింధు మార్పును కోరుకుందని, మరో కోచ్‌ను వెతుక్కుంటోందన్న పార్క్.. ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని పేర్కొన్నాడు. వచ్చే ఒలింపిక్స్ వరకు సింధుతో ఉండలేకపోతున్నందుకు క్షమించాలన్నాడు. అయితే, దూరం నుంచి ఆమెకు మద్దతు తెలుపుతూనే ఉంటానని పేర్కొన్నాడు.

More Telugu News