Nalgonda District: తాను ప్రేమించిన అమ్మాయి ఫ్రెండ్ సొంతమవుతుందేమోనని అనుమానం.. పార్టీ పేరుతో పిలిచి స్నేహితుడిని చంపేసిన యువకుడు!

Friend killed friend in a love affair in Hyderabad
  • నల్గొండలో బీటెక్ చదువుతున్న యువకులు
  • ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించడంతో విభేదాలు
  • చంపేసి హైదరాబాద్-విజయవాడ రహదారి పక్కన పడేసిన వైనం
  • దొరికిపోతానన్న భయంతో గత రాత్రి లొంగుబాటు!
ప్రేమ.. ఇద్దరి స్నేహితుల మధ్య చిచ్చుపెట్టింది. చివరికది హత్యకు దారితీసింది. తాను ప్రేమించిన అమ్మాయి ఎక్కడ తన స్నేహితుడి సొంతమైపోతుందోనని అనుమానించిన యువకుడు పార్టీ పేరుతో ఫ్రెండ్‌ని రప్పించి అంతమొందించాడు. హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

నాగర్‌కర్నూలు జిల్లా సిరిసనగండ్లకు చెందిన నేనావత్ నవీన్ (20) నల్గొండలోని ఎంజీ యూనివర్సిటీ పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ (ఈఈఈ) ఫోర్త్ ఇయర్ చదువుతున్నాడు. అదే కాలేజీలో చదువుతున్న హరి అతడికి స్నేహితుడు. ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమిస్తుండడంతో వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఈ నెల 17న ఉదయం పార్టీ చేసుకుందామని రావాలంటూ నవీన్‌ను రవి ఆహ్వానించాడు. సరేనన్న నవీన్ హైదరాబాద్ అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలో ఉండే హరి స్నేహితుడి గదికి వెళ్లాడు. 

అక్కడ పార్టీ జరుగుతుండగా హరి, నవీన్ మధ్య అమ్మాయి విషయం చర్చకు రావడంతో గొడవ మొదలైంది. దీంతో నవీన్ తన తండ్రి శంకరయ్యకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఆయన హరితో మాట్లాడడంతో గొడవ సద్దుమణిగింది. ఆ తర్వాత నాలుగు రోజులైనా నవీన్ అటు ఇంటికి కానీ, ఇటు కాలేజీకి కానీ వెళ్లకపోవడంతో అనుమానించిన తండ్రి శంకరయ్య నార్కట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. 

ఈ క్రమంలో ఈ నెల 22న సాయంత్రం నుంచి హరి ఫోన్ స్విచ్ఛాప్‌లో ఉండడంతో అతడి కుటుంబ సభ్యులను పిలిపించి విచారించారు. ఈ క్రమంలో ఇక తప్పించుకోవడం సాధ్యం కాదని భావించిన హరి గత రాత్రి అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్టు తెలుస్తోంది. తాను ప్రేమించిన అమ్మాయి నవీన్ సొంతమైపోతుందేమోనన్న అనుమానంతోనే అతడిని హత్య చేసి హైదరాబాద్-విజయవాడ రహదారిపై పడేశానని పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Nalgonda District
Hyderabad
Love Affair
Crime News

More Telugu News