Harry Brook: ఇంగ్లండ్ యువ బ్యాట్స్ మన్ హ్యారీ బ్రూక్ ప్రపంచ రికార్డు

  • ఇంగ్లండ్ ఆశాకిరణంగా గుర్తింపు పొందిన హ్యారీ బ్రూక్
  • తొలి 9 ఇన్నింగ్స్ ల్లో 807 పరుగులతో వరల్డ్ రికార్డు
  • గతంలో వినోద్ కాంబ్లీ పేరిట రికార్డు
  • బ్రూక్ సగటు 100.8
England batsman Harry Brook set world record

క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు హ్యారీ బ్రూక్. వయసు 24 ఏళ్లు. ఇటీవలే ఇంగ్లండ్ జాతీయజట్టులోకి వచ్చిన ఈ డాషింగ్ బ్యాట్స్ మన్ అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో అతి తక్కువ ఇన్నింగ్స్ లలో 800కి పైగా పరుగులు సాధించిన తొలి క్రికెటర్ గా హ్యారీ బ్రూక్ రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించుకున్నాడు. 

ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్ పర్యటనలో ఉండగా, రెండో టెస్టులో హ్యారీ బ్రూక్ అజేయ సెంచరీ బాదాడు. తద్వారా తొలి 9 ఇన్నింగ్స్ లలో 807 పరుగులతో ప్రపంచ రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు భారత ఆటగాడు వినోద్ కాంబ్లీ పేరిట ఉండేది. కాంబ్లీ తన తొలి 9 ఇన్నింగ్స్ ల్లో 798 పరుగులు చేశాడు. 30 ఏళ్ల నాటి ఈ రికార్డును ఇప్పుడు హ్యారీ బ్రూక్ తిరగరాశాడు. 

ప్రస్తుతం బ్రూక్ సగటు చూస్తే ప్రపంచ అగ్రశ్రేణి బ్యాట్స్ మెన్ సైతం అసూయపడాల్సిందే! ఇప్పటిదాకా 6 టెస్టులు ఆడిన బ్రూక్ సగటు 100.8 అంటే అతడి పరుగుల విధ్వంసం ఏ విధంగా కొనసాగుతోందో అర్థమవుతోంది. ఇప్పటిదాకా 4 సెంచరీలు కొట్టిన బ్రూక్... ఇంగ్లండ్ జట్టుకు ఆశాకిరణంలా మారాడు. 

అన్నట్టు... ఈ భారీ ఇన్నింగ్స్ ల ఆటగాడిని ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ రూ.13.25 కోట్లతో కొనుగోలు చేయడం విశేషం. టెస్టుల్లో చితక్కొడుతున్న హ్యారీ బ్రూక్ మరి ఐపీఎల్ లో ఎలా రాణిస్తాడన్నది ఆసక్తి కలిగిస్తోంది.

More Telugu News