Andhra Pradesh: స్నేహితుడి ఫోన్‌ నుంచి అతడి ప్రియురాలి నగ్నఫొటోలు దొంగిలించి బ్లాక్‌మెయిల్.. కడతేర్చిన యువకుడు!

Friend Killed Another Friend for Blackmailing His Girl Friend
  • వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్యాయత్నం
  • విషయం తెలిసి స్నేహితుడిని చంపేయాలని ప్లాన్ 
  • మరో ఫ్రెండ్‌తో కలిసి కత్తితో పొడిచి హత్య
  • కర్నూలు జిల్లాలో ఘటన
తన ఫోన్‌లోంచి ప్రియురాలి నగ్న ఫొటోలు దొంగిలించి వాటిని చూపించి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న స్నేహితుడిని చంపేశాడో యువకుడు. పోలీసుల కథనం ప్రకారం.. కర్నూలు మండలం బాలాజీనగర్‌కు చెందిన ఎరుకలి దినేశ్, మల్లెపోగు మురళీకృష్ణ (22) స్నేహితులు. దినేశ్ డిగ్రీ చదువుతుండగా, మురళీకృష్ణ పూల అలంకరణ పనిచేస్తుంటాడు. దినేశ్ తన ప్రియురాలి నగ్న ఫొటోలు, వీడియోలను తన ఫోన్‌లో పెట్టుకున్నాడు. వాటిని చూసిన ముురళీకృష్ణ రహస్యంగా తన ఫోన్‌లోకి వాటిని పంపుకున్నాడు. 

అనంతరం స్నేహితుడి ప్రియురాలికి ఫోన్ చేసి ఆ వీడియోలు తన వద్ద ఉన్నాయంటూ వేధించడం మొదలుపెట్టాడు. వాటిని కుటుంబ సభ్యులకు పంపుతానని బెదిరించేవాడు. మురళీకృష్ణ వేధింపులు భరించలేక ఆమె ఒకసారి ఆత్మహత్యకు కూడా యత్నించింది. విషయం తెలిసిన దినేశ్.. స్నేహితుడు మురళిపై కోపంతో ఊగిపోయాడు. అతడిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. 

ఈ క్రమంలో కిరణ్ కుమార్ అనే మరో స్నేహితుడితో కలిసి మురళి హత్యకు ప్లాన్ వేశాడు. జనవరి 25న మురళీకృష్ణను బైక్‌పై పంచాలింగాల ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ మురళిని కత్తితో పొడిచి చంపేశారు. అనంతరం ఓ ఆటోలో మృతదేహాన్ని తీసుకెళ్లి నన్నూరు టోల్‌ప్లాజా శివారులోని హెచ్ఎన్ఎస్ఎస్ కాలువలోకి విసిరేశారు. అతడి దుస్తులు, సెల్‌ఫోన్‌ను వేర్వేరు చోట్ల పడేసి వెళ్లిపోయారు. 

కుమారుడు కనిపించకపోవడంతో మురళీకృష్ణ తల్లిదండ్రులు పలుచోట్ల గాలించారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఈ నెల 16న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మురళీకృష్ణ స్నేహితుడైన దినేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య విషయం వెలుగు చూసింది. మురళీ కృష్ణ మృతదేహం కోసం హంద్రీనీవా కాలువలో గాలిస్తున్నారు.
Andhra Pradesh
Kurnool District
Crime News

More Telugu News